తెలంగాణ

telangana

ETV Bharat / state

అడవిలో అలజడి.. గొత్తికోయలెవరు.. ఎక్కడి నుంచి వస్తున్నారు? - పెరుగుతున్న గొత్తికోయల సంఖ్య

Gothi Koya People Increased in Telanagana: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫిసర్‌ శ్రీనివాసరావు హత్యతో గుత్తికోయల పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మన రాష్ట్రానికి వలస వస్తున్న వీరి సంఖ్య 34 వేలకు పైగా ఉంది. ఈ సంఖ్య నిత్యం పెరుగుతోందని అటవి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పోడు వ్యవసాయం పేరుతో అడవులను పదేపదే నరికేస్తున్నారని వీరిపై ప్రధాన ఆరోపణ. అయితే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్నవారు వీళ్లను పావులుగా వాడుకుంటూ పోడు చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ి
ి

By

Published : Nov 24, 2022, 7:54 PM IST

అటవీ ప్రాంతాల్లో పెరుగుతున్న గొత్తికోయల సంఖ్య

Gothi Koya People Increased in Telanagana: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో గొత్తికోయల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు గతంలో అక్కడ నక్సల్స్, సల్వాజుడుం మధ్య పోరులో నలిగిపోతూ బతుకుదెరువు కోసం వలస వచ్చి పోడు సాగు చేసేవారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ సమస్య ఇప్పుడంతగా లేకపోయినా పెద్దసంఖ్యలో రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. పోడుతో పాటు మిర్చి, పత్తి చేలల్లో పనుల కోసం వస్తున్న వీరు ఇక్కడి అటవీ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 34,265 మంది గొత్తికోయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి అధీనంలో 22,833 ఎకరాల అటవీభూమి ఉన్నట్లు ఆ శాఖ సమాచారం. అయితే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్నవారు వీళ్లను పావులుగా వాడుకుంటూ పోడు చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. రేంజర్‌ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో గొత్తికోయల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వీరి ఆవాసాలు ఉన్నాయి. ఇందులో కొత్తగూడెం జిల్లాలో సమస్య అధికంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే 23,990 మంది గొత్తికోయలు ఉన్నట్లు అటవీవర్గాల సమాచారం.

రాష్ట్రంలోని గిరిజనులు గ్రామాల సమీపంలోని అటవీభూముల్లో పోడు సాగు చేస్తుంటే.. గొత్తికోయలు మాత్రం అడవి మధ్యలో చేస్తుంటారు. వన్యమృగాలు సంచరించే ప్రాంతంలోనే నివసిస్తూ.. బాణాలు, ఇతర ఆయుధాలతో తిరుగుతుంటారు. గొత్తికోయలతో గతంలో ఘర్షణలు జరిగినా అవి చిన్నచిన్నవే. వారి దాడిలో ఓ అధికారి చనిపోవడం మాత్రం ఇదే తొలి సారి. గొత్తికోయలు ఆయా మండలాల్లో ఆధార్, రేషన్‌ కార్డుల పొందడంతోపాటు ఓటర్లుగా కూడా నమోదవుతున్నారు. సాధారణంగా జీవనాధారం కోసం ఒకసారి అడవిని నరికేస్తారు. గొత్తికోయలు మాత్రం పలుమార్లు నరికేస్తుండటం వెనుక స్థానిక నేతలు ఉన్నారని, ఆ భూముల్ని తమ అధీనంలో ఉంచుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

గొత్తికోయలు సాగుచేస్తున్న భూములను పలుచోట్ల అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని హరితహారంలో భాగంగా మొక్కలు పెంచుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల వారితో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక్కడి వాళ్లే కూలీ పనులకోసం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొత్తికోయల్ని రప్పిస్తున్నారనీ.. ఆ తర్వాత వాళ్లు తిరిగి వెళ్లకుండా అడవుల్లో ఆవాసం ఏర్పాటుచేసుకుని చెట్లను నరికేస్తున్నారని అటవీ అధికారులు అంటున్నారు. అనధికారంగా వీరి సంఖ్య 50 వేల వరకు ఉండొచ్చని అంచనా.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details