Forest Officers Protest in Khammam : ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అంత్యక్రియలకు హాజరైన మంత్రులను అటవీ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. గుత్తికోయల దాడుల నుంచి రక్షించాలని కోరారు. మంగళవారం రోజున గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలు నేడు ప్రభుత్వలాంఛనాలతో నిర్వహించారు. శ్రీనివాసరావు అంత్యక్రియల్లో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ పాల్గొని పాడె మోశారు.
Forest Officers Protest at FRO Funeral : తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు, సిబ్బంది మంత్రుల ఎదుట వాపోయారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు సమకూర్చాలని మంత్రులకు విన్నవించుకున్నారు. కాసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రులు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఆయుధాల అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.