తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలపై గత కొద్దిరోజులుగా దృష్టి సారించారు. ఏజెన్సీ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేయటంతోపాటు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల బృందం పోలీసులకు తారసపడినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సమయంలోనే పోలీసులు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ గ్రేహౌండ్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెప్పారు.
అమరవీరుల వారోత్సవాలు
మల్లెపల్లితోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 15 మంది మావోల బృందం పాల్గొన్నట్లు తెలిసింది. వీరితోపాటు మరికొంత మంది మావోయుస్టులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మావోలు వ్యూహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి నది మీదుగా మణుగూరు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు.