భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రబీలో అన్ని పంటలు కలిపి 35,740 హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో వరి 25,195, మొక్కజొన్న 5,757 హెక్టార్లు ఉంది. శనివారం కురిసిన అకాల వర్షం ప్రభావంతో జిల్లాలో మొత్తంమీద సుమారు 20 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. మరో 32 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం చేకూరినట్లు అధికారులు అధికారికంగా గుర్తించారు.
అశ్వారావుపేట మండలంలో 6 హెక్టార్లు(అరటి)లో, దమ్మపేటలో 10, జూలూరుపాడు 2, ములకలపల్లి 10, బూర్గంపాడులో 4 హెక్టార్ల(బొప్పాయి)లో పంట దెబ్బతింది. ఉద్యానాధికారులు 32 హెక్టార్లలో నష్టాన్ని అంచనా వేయగా.. అశ్వారావుపేటలో 40 ఎకరాల్లో అరటి, 70 ఎకరాల్లో మామిడి, 15 ఎకరాల్లో కూరగాయల, దమ్మపేటలో 40 ఎకరాల్లో అరటి, 80 ఎకరాల్లో మామిడి, అశ్వాపురంలో 20 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. అశ్వారావుపేట-నారంవారిగూడెం మధ్య ఆయిల్‌పాం చెట్లు నేలకూలాయి.
ఏఏ మండలాల్లో ఎంత నష్టం..
దమ్మపేట మండలంలో 110 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు ఆయకట్టు పరిధిలో కుందారం, చెదలవాడ కాలువల కింద 2,500 ఎకరాల్లో కోతకు వచ్చిన వరిపైరు నేలకొరిగింది. ఒక్క అశ్వాపురంలోనే 812 ఎకరాల్లోని పైరులో 33 శాతం నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుమారు 151 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 80 ఎకరాల్లో వరి, బూర్గంపాడులో 5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు రైతులు పేర్కొన్నారు.
తడిసిన ధాన్యం రాశులు
ములకలపల్లిలో 130 క్వింటాళ్లు, చంద్రుగొండ మండలం మద్దుకూరు, దామరచర్లలో 600 బస్తాలు, అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన, అబ్బుగూడెంలో 400 బస్తాల ధాన్యం తడిసింది. ఆయా ప్రాంతాలను ఏడీ అఫ్జల్‌బేగ్ ఆదివారం పరిశీలించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, బుగ్గపాడులో మరో 600 బస్తాల ధాన్యం తడిసినట్లు రైతులు పేర్కొన్నారు. పంట నష్టం అంచనా వేసేందుకు ఆదివారం అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో, ఉద్యాన శాఖ అధికారిణి శాంతి ప్రియ బూర్గంపాడులో, ఏడీఏ తాతారావు అశ్వాపురంలో పర్యటించారు. పంట క్షేత్రాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు.