భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పక్కనే ఉన్న ఎటపాకలో మద్యం దుకాణం ప్రారంభించగా... జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఉదయం 11 గంటలకు దుకాణం తెరిచేందుకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయగా... ఉదయం 8 గంటల నుంచి మద్యం ప్రియులు క్యూలైన్లలో వేచిఉన్నారు.
మద్యం కోసం కిలోమీటర్ల మేర బారులు - LOCK DOWN UPDATE
'ఎన్నాళ్లో వేచిన ఉదయం... ఈనాడే ఎదురవుతుంటే...' అంటూ పాటందుకుంటున్నారు మద్యం ప్రియులు. లాక్డౌన్ పుణ్యమా అని మద్యానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్న మందుబాబులు... వైన్షాపులకు అనుమతిచ్చారని తెలియటంతో వారి ఆనందానికి అవధులు లేవు. దుకాణాల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నా.. రేట్లు పెంచినా... మందు దొరికితే చాలని పడిగాపులు పడుతున్నారు.
మద్యం దుకాణానికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర మద్యం ప్రియులు పడిగాపులు పడ్డారు. ఒక్కొక్కరికి 3 బాటిళ్లు మద్యాన్ని విక్రయించవచ్చని ప్రభుత్వం సూచించినప్పటికీ... దుకాణంలో మద్యం నిల్వలు తక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ మాత్రమే విక్రయిస్తున్నారు.
జనాలలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ఆబ్కారీ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు మద్యం బాటిళ్లు దొరికిన మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధర 25శాతం పెంచినప్పటికీ... మద్యం దొరికితే చాలని ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.