Devotees rush in temples: కార్తిక మాసం చివరి వారం, ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. కార్తిక దీపారాధనలు చేసేందుకు మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య(Devotees rush in Bhadradri temple) సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి తరలిరావడంతో ఆలయంలోని క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కార్తిక మాసం సందర్భంగా ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
బేడా మండపంలో జరిగే సీతారాముల నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దీ పెరగడంతో ఆలయ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మాడవీధులు, ప్రసాదం కౌంటర్లు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
నారసింహుని సన్నిధిలో
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Devotees rush in Yadadri temple) సన్నిధిలో కార్తిక శోభ నెలకొంది. కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. దర్శన, లడ్డూ ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది.