తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి ఆలయంలో వైభవంగా శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాద్రి ఆలయంలో శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ వేడుకలు నిర్వహించిన ఆలయ అర్చకులు.. అనంతరం ధ్వజ పట ఆవిష్కరణ చేశారు. రేపు సాయంత్రం నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి.

brahmothsavalu at bhadradri temple
భద్రాద్రి ఆలయంలో బ్రహ్మోత్సవాలు..

By

Published : Mar 28, 2023, 3:47 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు సాయంత్రం నుంచి ప్రధాన ఘట్టాలు ప్రారంభమవనున్నాయి. ఈ నెల 30న సీతారాముల కల్యాణ మహోత్సవం, మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు..:బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు ఉదయం ఆలయ అర్చకులు బేడా మండపంలో అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠ వంటి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బేడా మండపంలో సీతారాముల ఎదుట ప్రకృతి పరంగా అగ్నిని సృష్టించి.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ధ్వజ పట ఆవిష్కరణ చేశారు.

ధ్వజ పట ఆవిష్కరణ..బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ధ్వజ పట ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి.. పూజలు నిర్వహించిన ధ్వజపటాన్ని ధ్వజ స్తంభం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ పటానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామి వారికి నివేదన చేసిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలకు అందించారు. భద్రాచలంలో గరుడ పట ఆవిష్కరణ రోజు సంతానం లేని మహిళలు గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే.. సంతానం కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా భక్తుల నమ్మకం. గరుడ పట ఆవిష్కరణ సందర్భంగా సంతానం లేని అనేక మంది మహిళలు వచ్చి గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు.

స్వామివారి కల్యాణం..:ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్థానార్చనం, భేరీ పూజా, దేవతా ఆహ్వానము, బలి హరణం, హనుమధ్ వాహన సేవ వేడుకలు జరపనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. రేపు సాయంత్రం (మార్చి 29) నుంచి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. సీతారాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా రేపు సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం కార్యక్రమం జరగనుంది. అలాగే ఈ నెల 30వ తారీఖున శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కల్యాణ మహోత్సవం తర్వాత మార్చి 31న ఆలయంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు ఘనంగా జరపనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details