భద్రాచలంలో నేటి నుంచి ఏప్రిల్ 20వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో వేడుకను నిర్వహిస్తారు. రామయ్య కల్యాణం చూసేందుకు భక్తులు భద్రాచలం వైపు సాగుతున్నారు.
భద్ర మహర్శి తపస్సుకు మెచ్చిన సీతారామ చంద్ర స్వామి భద్రుని శిరస్సుపై కాలు పెట్టి భద్రగిరిగా మార్చారు. ఆనాటి నుంచి భద్రగిరి భద్రాచలంగా పేరుగాంచింది. భద్రాచలంలో వెలసిన రామయ్యకు ఆలయం నిర్మించిన రామదాసు భక్తరామదాసుగా పేరుగాంచాడు.
ఆరుబయటే కల్యాణం
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా సీతారాముల కల్యాణం చూసేందుకు ఆరుబయటే కల్యాణం చేయాలని సంకల్పించారు. ఆనాటి నుంచి భద్రాచలంలో సీతారాముల కల్యాణం ఆరుబయటే జరుపుతూ.. భక్తులకు కనులవిందు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి నిత్యకల్యాణం, దర్బారు సేవ, పవళింపు సేవలను నిలిపివేయనున్నారు. బ్రహ్మోత్సవ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సీతారాములను చూసి పులకించి పోయేందుకు వచ్చే జనసందోహంతో భద్రాచలం కిటకిటలాడనుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు ఆలయ ఈవో రమేశ్‌బాబు పూర్తి చేశారు.
150 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు సిద్ధం
భక్తులందరికి అందించేందుకు 150 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు, భక్తులకు స్వాగతం పలికేందుకు స్వాగత ద్వారాలు, కల్యాణం తిలకించేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం అత్యంత అందంగా తీర్చిదిద్దారు.
కల్యాణ మండపం ప్రత్యేకత ఇదీ...
రామయ్య కల్యాణం జరిగే ఈ మండపం పూర్వం ఎనిమిది కాళ్ల మండపంగా ఉండేది. 1960లో మద్రాసు నుంచి ఏక శిలను తీసుకు వచ్చి కల్యాణ మండపం మొత్తాన్నీ ఒకే శిలతో నాలుగు కాళ్లతో అత్యంత అందంగా చెక్కారు. ఈ మండపంలో సకల రాశులు, కల్యాణ వైభవం, సింహాలు, ద్వార పాలకులు, దమ్మక్క విగ్రహం, పట్టాభిషేకంతో పాటు అందంగా ఆకర్షించే దేవతామూర్తుల విగ్రహాలను చెక్కారు. దీన్ని మెరుగుపట్టేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక నూనె తెచ్చి మండపానికి రాసి ఆకర్షణను తీసుకువచ్చారు. అప్పటి నుంచి కల్యాణ మండపం సుందరంగా తయారైంది.
ఈ తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలతో భద్రాద్రి దివ్య క్షేత్రంలో ఆధ్మాత్మికత వెల్లి విరుస్తుంది. భద్రాద్రికి వచ్చే వేలాది మంది భక్తులతో సందడిగా మారనుంది.
ఉగాది నాడు రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఇవీ చూడండి: 'ఓటు వినియోగమే కాదు... ఫిర్యాదులూ చేయండి'