తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం - Sri Rama Navami

భద్రాద్రి రామయ్య కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటేటా జరిగే కల్యాణానికి భక్తులు పెరుగుతూ వస్తున్నారు. మిథిలా మండపం ప్రాంగణంలో కన్నుల పండువగా అభిజిత్​ లగ్నమున వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణం రమణీయంగా జరిగింది.

సీతారాముల కల్యాణమహోత్సవం

By

Published : Apr 14, 2019, 6:17 PM IST

Updated : Apr 14, 2019, 9:17 PM IST

రఘుకుల తిలకుడు.. కౌశల్యా దశరథుల కుమారుడు శ్రీరామ చంద్రునికి, జనకుని కుమార్తె... సీతాదేవికి కల్యాణం మిథిలా ప్రాంగణంలో అభిజిత్​ లగ్నాన కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో నీలిమేఘశ్యాముడు ఓరచూపుచూస్తుండగా సుగుణాల సీతమ్మ సిగ్గులొలికే వేళ... సకల దేవతలూ దిగివచ్చిన సమయాన.. చైత్రశుద్ధ నవమి కర్కాటక రాశిలో సీతారాముల పరిణయ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులు నయనాదంపొంది పులకించిపోయారు. మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన వివాహం చూసినవారు భక్తి పారవశ్యంలో మునిగితేలారు.


ఉదయం ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, కోలాటాల నడుమ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం సుందరంగా తీర్చిదిద్దిన మిథిలా మండపానికి చేరుకున్నారు. కల్యాణ క్రతువులో ప్రథమంగా విశ్వక్సేనుల ఆరాధన పుణ్యాహవచనం నిర్వహించి కల్యాణ సామగ్రికి సంప్రోక్షణ చేసి రక్షాబంధనం నిర్వహించారు. అనంతరం కౌశల్య సుతునికి పట్టాభిషేక వేడుక జరిపారు.


వేదపండితులు ఇరువంశాల గోత్రాలను పఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పాదప్రక్షాళన, మహాదానాల సమర్పణ గావించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు మారుమోగిన వేళ.. మంగళ వాద్యాల చప్పుడు మిన్నంటిన సమయాన సిగ్గులమొగ్గైన సీతమ్మ మెడలో కోదండ రాముడు మాంగళ్యధారణ చేశాడు. వేడుకకు విచ్చేసిన సకల దేవతలు ఆశీర్వదించినట్లుగా పుప్పాభిషేకం జరిగింది. భక్తులు జయజయ ద్వానాలతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది.


ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఎవరి ముఖం చూసినా భక్తిపారవశ్యంలో వెలిగిపోతున్నాయి. దేవదేవుని కల్యాణం ప్రత్యక్షంగా చూసి తాము పుణీతులమైనామంటూ పులకరించిపోయారు.


భద్రత ఏర్పాట్లు
భక్తుల రద్దీ దృష్ట్యా మిథిలా మండప ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.


ప్రత్యేక సౌకర్యాలు
వేసవి దృష్ట్యా, భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేశారు.

ఖమ్మంలో శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం

ఇవీ చూడండి: భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణ వేడుకలు

Last Updated : Apr 14, 2019, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details