భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల (Badradri Ramaiah Devotees)పై ఆలయ సిబ్బంది వీరంగం సృష్టించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన సుమారు 30 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. ఈ నేపథ్యంలో దర్శనం అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. ఒక్కో లడ్డు 20 రూపాయలు చొప్పున 50 లడ్డూలకు 1,000 రూపాయలు ఇచ్చి టోకెన్లు తీసుకున్నారు.
టోకెన్లు ఇచ్చి లడ్డూలు తీసుకునే క్రమంలో 50 లడ్డూలకి బదులు ఇరవై లడ్డూలు మాత్రమే ఇచ్చారని భక్తులు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించగా లడ్డు కౌంటర్లోని ఆలయ సిబ్బంది భక్తులపై వాగ్వాదానికి దిగారు. ఆలయ పోలీసులను పిలిపించి బయటకు నెట్టివేయించారు. మనస్తాపం చెందిన భక్తులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చాలాసేపు నిరసన చేసిన అనంతరం పట్టణ సీఐ స్వామి భక్తులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.