గోదావరి వరద పెరుగుతున్నందున వరద సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని.. భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ అనుదీప్ కోరారు. అశ్వాపురం, మణుగూరు మండలాల్లో పర్యటించి... వరద ఉద్ధృతిని పర్యవేక్షించారు. అశ్వాపురం మండలంలో ముంపునకు గురైన ప్రాంతాలను, మణుగూరులో పునరావాస కేంద్రంలో బాధితులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
600 మంది పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు - ముంపు ప్రాంతాలు పరిశీలించన అదనపు కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరు మండలాల్లో గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి... భోజనం, వైద్యం సహా అన్ని సౌకర్యాలు చేసినట్టు వివరించారు.
పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు..
గోదావరి పరివాహక ప్రాంతంలోని ఒక్కో మండలంలో ఐదు నుంచి ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ అనుదీప్ ఈటీవీ భారత్కు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం, వైద్యం సహా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు వివరించారు. కరోనావైరస్ నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామన్నారు.
600 మంది తరలింపు
జిల్లాలో గోదావరి వరద ముంపునకు గురైన 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఇంకా మరికొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఒకేసారి ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున... ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. వరద ఉద్ధృతి తగ్గితే పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం సూచనల ప్రకారం పరిహారాన్ని చెల్లిస్తామన్నారు.
TAGGED:
adanapu collector paryatana