తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగులో అన్నదాతలు.. నకిలీ విత్తనాలు అంటగట్టే పనిలో అక్రమార్కులు

అదను చూసి, అధిక దిగుబడుల ఆశచూపి అక్రమార్కులు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. పేరు మోసిన కంపెనీలను తలదన్నే రీతిలో రంగుల ప్యాకెట్లతో ఆకర్షిస్తున్నారు. దళారుల మాటలు నమ్మి అన్నదాతలు నష్టపోతున్నారు. విత్తన విక్రయాల దందా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి కూడా యథేచ్ఛగా సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే రూ.కోటికిపైగా నకిలీ విత్తనాలను వివిధ శాఖల అధికారులు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఓవైపు అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు అనుమతిలేని విక్రయాలు విస్తుగొలుపుతున్నాయి. మరింత అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.

awareness on fake seeds
నకిలీల బరి.... రైతులే గురి!

By

Published : Jul 2, 2020, 9:05 AM IST

పూర్వ ఖమ్మం జిల్లాలో వాణిజ్య పంటలైన పత్తి, మిరప సాగుకు రైతులు భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. విత్తనాల ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇదే అదునుగా నకిలీ కంపెనీలు, వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. ఈసారి ఇంకా 30 శాతం కూడా విత్తలేదు. ఇప్పటికే ఉభయ జిల్లాల్లో నాసిరకం విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటంతో అక్రమార్కుల వ్యాపారం సులువుగా సాగుతోంది. ఏపీలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వ్యాపారులు దందా సాగిస్తున్నారు. ఈసారి మహబూబ్‌నగర్‌తో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌ ప్రాంతాల నుంచి అనుమతి లేని విత్తనాలంటగడుతున్నట్లు తెలిసింది.

టాస్క్‌ఫోర్స్‌ దాడులతో దడపుట్టిస్తున్నా..

ఉమ్మడి జిల్లాలో పది వ్యవసాయ డివిజన్లున్నాయి. ఖమ్మం జిల్లాలో కూసుమంచి, ఖమ్మం అర్బన్‌, వైరా, మధిర, కల్లూరు, భద్రాద్రి జిల్లాలో మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి.

అనుమతి, బిల్లులు లేకుండా విక్రయించే నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా వీరి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ బృందంలోని పోలీస్‌, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా సాగిస్తున్న దాడుల్లో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. ఓపక్క తనిఖీలు జరుగుతున్నా అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు.

రైతులు మేల్కోవాలి..

విత్తనమెరిగి సాగు చేస్తేనే సాగు ఫలవంతమవుతుంది. విశిష్టమైన వంగడాలు పొందడంపై రైతులు జాగరూకతతో ఉండాలి. అధికారులు సైతం పర్యవేక్షణ పెంచి అక్రమార్కులు దరిచేరకుండా పటిష్ట నిఘా పెట్టాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో పేరున్న కంపెనీల విత్తనాలు కొనుగోలు చేసి విధిగా బిల్లులు పొందాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ రైతులను చైతన్యవంతం చేయాలి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి.

విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి

సాగు సాఫీగా సాగాలంటే విత్తనం ఎంపిక చాలా ముఖ్యం. లైసెన్సు ఉన్న దుకాణాల్లోనే వీటిని కొనుగోలు చేయాలి. విత్తనం తీసుకున్నప్పుడు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. దళారులు గ్రామాలకు వచ్చి తక్కువ ధరకు అమ్మే విత్తనం కొంటే నష్టపోతారు. గతేడాదివి ఈసారి కొనుగోలు చేయవద్ధు

-అభిమన్యుడు, భద్రాద్రి జిల్లా వ్యవసాయ అధికారి

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు తప్పవు

వెంకట్రావ్‌, ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ

సీపీ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్సు బృందాలు పని చేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,18,75000 నకిలీ, అనుమతిలేని విత్తనాలు సీజ్‌ చేశార. వీటిలో రూ.54 లక్షల విలువైన మిరప, రూ.47 లక్షల పత్తి విత్తనాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలతో రైతులను ముంచేవారిపై కఠిన చర్యలు తప్పవు.

ఇవీ చూడండి: నేటి నుంచి ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో కరోనా చికిత్స

ABOUT THE AUTHOR

...view details