తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాలే కన్నబిడ్డలు - ఇమ్మానియేల్​

సంతానం లేని ఆ దంపతులు శునకాలనే.. బిడ్డలుగా పోషిస్తున్నారు. వ్యాయామం కోసం కుక్కను పెంచుకోమని వైద్యుడు సలహాతో.. ఏకంగా నాలుగు శునకాలను సాకుతున్నాడు ఆ ఉపాధ్యాయుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంగన్నపాలెంకు చెందిన ఇమ్మానియేల్​ అనే ఉపాధ్యాయుడు.. నాలుగు కుక్కలను పెంచుతూ మూగప్రేమతో తరిస్తున్నాడు.

మూగజీవాలే కన్నబిడ్డలు

By

Published : Aug 12, 2019, 11:49 PM IST

మూగజీవాలే కన్నబిడ్డలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని వెంగన్నపాలెం టీచర్స్​ కాలనీకి చెందిన ఇమ్మానియేల్​.. మాచినేని పేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కొత్తగూడెంలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వెళ్లిన మాస్టరుకు మధుమేహం ఉందని వైద్యులు తెలిపారు. మానసిక ఉల్లాసంతో పాటు వ్యాయామం చేసేలా ఓ కుక్కను పెంచుకోమని వైద్యులు సలహా ఇచ్చారు. యాతాల కుంటలో పనిచేస్తున్నపుడు ఓ విద్యార్థి.. ఇమ్మానియేల్​కు చిన్న కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. శునకాన్ని తీసుకున్న ఇమ్మానియోల్​.. దాని పుట్టిన రోజు 10 నవంబర్ 2012 అని ( 10 తేదీ, 11 నెల, 2012 సంవత్సరం) అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆ కుక్కపిల్లకు బిట్టు అని పేరు పెట్టి.. ఏటా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నాడు. బిట్టును పెంపుడు బిడ్డగా భావించి పోషిస్తున్నాడు. ఉదయం, సాయంత్రం వ్యాయమానికి శునకాన్ని తీసుకెళ్లడం మొదలు పెట్టాడు.

కొద్ది రోజులకు బిట్టుకు.. మూడు పిల్లలు పుట్టాయి. వాటికి బుడ్డి, అర్చిత, రూపాదేవి అని పేర్లు పెట్టాడు. నాలుగు శునకాలను సాకటం ఖర్చుతో కూడుకున్న పనైనా తన బిడ్డలుగా భావించి పోషిస్తున్నాడు. ఎంత ఖర్చయినా భరిస్తున్నారు. బిస్కెట్లు, పాలు స్వయంగా పట్టిస్తారు. మధ్యాహ్నం పెరుగుతో భోజనం, సాయంత్రం మాంసాహారం పెట్టి.. ఆహారం లోటు లేకుండా ఇస్తాడు. వాటిని ప్రత్యేకంగా గదుల్లో ఉంచి కూలర్లు, పంకాలు, రక్షణగా ఇనుప జాలీలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశాడు. చిన్నతనం నుంచి వాటిని పెంచడం వల్ల అవి.. పిల్లల మాదిరి ఆటలాడటం, అలగడం చేస్తుంటాయి. శునకాలు అలిగినపుడు.. ఎత్తుకుని తిప్పాల్సిందేనని ఇమ్మానియేల్​ చెప్తున్నాడు.

సంతానం లేని ఆ దంపతులకు శునకాలే ప్రేమను పంచుతున్నాయి. ఖాళీ సమయంలో ఎలాంటి మనోవేదన లేకుండా చేస్తున్నాయి. దైవభక్తితో చర్చికి వెళ్లిరావడం, తమ విధులకు హాజరుకావడం, శునకాల ఆలనాపాలనా చూడటం వీరు దినచర్యగా పెట్టుకుని తమ జీవితాన్ని గడుపుతున్నారు. మూగజీవాలు కూడా దంపతులపైకి ఎక్కి.. వాటి అభిమానాన్ని చాటుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details