కరోనా ప్రభావంతో ప్రయాణికులు రాక ఆర్టీసీ సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. గతేడాది కార్మికుల సమ్మెతో 58 రోజులు సంస్థ మూతపడింది. ఈ ఏడాది లాక్‌డౌన్ వల్ల 45 రోజులు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం బస్సులు తిరుగుతున్నా ఉద్యోగులు, కార్మికుల వేతనాలకు సరిపడా ఆదాయం కూడా రావడం లేదు. సంస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం జూన్ 19న కార్గో సేవలను ప్రారంభించింది. ప్రైవేటు వ్యాపారుల నుంచి పోటీలో నిలదొక్కుకునేందుకు పార్సిల్, కొరియర్ ఛార్జీలు భారీగా తగ్గించడంతో కాస్త ఆదాయం సమకూరుతోంది.
కార్గో సేవలతో రోజుకు రూ.21 వేల ఆదాయం
రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఖానాపూర్, భైంసా, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట్, జన్నారం 12 బస్టాండ్‌లలో కార్గో పార్సిల్, కొరియర్ సేవలను ప్రారంభించారు. కేంద్రాల నిర్వహణ బాధ్యతలను కండక్టర్‌లకు అప్పగించారు. ప్రైవేటు వ్యాపారుల నుంచి పోటీ తట్టుకునేందుకు ఛార్జీలు భారీగా తగ్గించారు. దీంతో రోజు రోజుకు ఆదాయం పెరుగుతోంది.
సేవలకు స్పందన పెరుగుతుండడంతో రీజియన్ పరిధిలో మరో 20 చోట్ల ప్రైవేటు ఏజెంట్లను నియమించి సేవలు విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇప్పటికే ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సంగణకం, కార్యాలయానికి గది, ర్యాకులు, ప్రజలతో మంచి పరిచయాలున్న వారిని మొదటి దశలో 20 మందిని ఎంపిక చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేటలో కూరగాయల రవాణా సేవలు కూడా మొదలయ్యాయి. రాఖీలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పంపడం ద్వారా రాఖీ పండగను సైతం ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంది.
పార్సిల్ సర్వీసు ఛార్జీలు రూ.లలో..
కి.మీ | ఛార్జీలు | |
0-5 కిలోలు | 6-10 కిలోలు | |
0-75 | 20 | 50 |
76-200 | 25 | 60 |
201-300 | 30 | 75 |
301-400 | 40 | 85 |
401-500 | 50 | 110 |
501-600 | 60 | 120 |
ఆదాయం ఇలా..
జూన్ 19 నుంచి 30 వరకు ఆదాయం : రూ. 1,35,688
రోజుకు సగటున : రూ.11,307