తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారిపై కోడిపిల్లల గుంపు.. సంచుల్లో నింపుకెళ్లిన జనం - రహదారిపై వేల కొద్దీ కోడిపిల్లలు

Chicks on Road: పట్టణాల్లో, ఊళ్లలో సైకిల్​పై ఓ పెద్ద బుట్టలో రంగురంగుల కోడిపిల్లలను తీసుకొచ్చి విక్రయించడం బాగా సుపరిచితం. గులాబీ, నీలం, తెలుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా విభిన్న రంగుల్లో చూడముచ్చటగా కనిపించే ఆ బుజ్జి కోడిపిల్లలను కొనుగోలు చేయడానికి చిన్నపిల్లలు ఆసక్తి కనబరుస్తారు. వాటిని కొని ఇంట్లో పెంచుతుంటే చాలా కాలక్షేపంగా ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ.. ఇప్పుడు వాటిని విక్రయించేవారు కనుమరుగయ్యారు. దీంతో వాటిని కొనేవారూ లేరు. కానీ చాలా ఏళ్ల తర్వాత.. అలాంటి సందడి రోడ్డుపై కనిపించింది. పది, ఇరవై కాదు ఒకేసారి వందల సంఖ్యలో కోడిపిల్లలు కీచు కీచు శబ్దాలతో అటుగా వెళ్తున్న వారిని అలరించాయి.

Chicks on Road
రహదారిపై కోడిపిల్లలు

By

Published : May 6, 2022, 12:39 PM IST

Chicks on Road: కోళ్ల ఫారాల్లో ఉండే కోడిపిల్లలు రోడ్డుపైకి వచ్చాయి. హాయిగా నీడ పట్టున ఉంటూ.. యజమానులు వేసే గింజలు తింటూ విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ బుజ్జిపిల్లలు.. రహదారిపై ఎండకు మాడిపోతున్నాయి. తాగేందుకు నీరు సైతం లేక అల్లాడిపోతున్నాయి. ఎవరు వాటిని రోడ్డు పాలు చేశారో తెలియదు కానీ.. అక్కడి స్థానికులకు మాత్రం ఆ కోడిపిల్లల రాక పండగలా మారింది. ఆదిలాబాద్​ పట్టణ శివారులో ఈ దృశ్యం తారసపడింది.

ఆదిలాబాద్ జిల్లా పట్టణ శివారు 44వ జాతీయ రహదారి పక్కన వేలకొద్ది సంఖ్యలో కోడి పిల్లలు కనిపించాయి. జాతీయ రహదారి పక్కగా ఉన్న కాలువలో ఒక్కసారిగా గుంపులుగుంపులుగా కోడి పిల్లలు కీచుమంటూ శబ్దాలు చేసుకుంటూ అటుగా వెళ్తున్న వారి దృష్టిని ఆకర్షించాయి. దీంతో స్థానికులు వాటిని పట్టుకొని తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు.

జందాపూర్ శివారులోని రహదారి పక్కన ఉన్న కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో తీసుకొచ్చి వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా వైరస్ సోకడంతో వాటిని వదిలేశారా లేక దొంగిలించి ఉద్దేశపూర్వకంగా వదిలి వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. కానీ దొరికిందే అవకాశం అనుకున్న స్థానికులు, వాహనదారులు మాత్రం ఇదే అదనుగా కోడిపిల్లలను సంచుల్లో నింపుకొని వెళ్లారు. ఏదేమైనా రోడ్డుపై వేసవికి అల్లాడుతున్న ఆ మూగజీవాలను స్థానికులు ఇంటికి తీసుకెళ్లి.. నీడపట్టున సేదతీరేలా చేయడం అభినందించాల్సిన విషయమే. కానీ వాటికి వైరస్​ సోకి.. ఇలా రోడ్డుపై వదిలేసి ఉంటే మాత్రం.. జనం లేని రోగాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే.!

కోడిపిల్లలను తీసుకెళ్లేందుకు స్థానికుల ఆసక్తి

ఇవీ చదవండి:కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ.. కీలకాంశాలపై చర్చ

అవతార్​ 'పండోరా'ను మరిపించే అద్భుత ప్రపంచం.. మన దేశంలోనే..

ABOUT THE AUTHOR

...view details