రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయి. జీవనోపాధి నిమిత్తం దశాబ్దాల కిందట సాగుకోసం ఇచ్చిన ఈ భూముల్లో కొంతకాలంగా స్థిరాస్తి వ్యాపారం మొదలైంది. గత ప్రభుత్వాలు జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల ప్రకారం 1954 కంటే ముందు అసైన్డ్ చేసిన భూములకు రెవెన్యూ పరంగా నిరభ్యంతర (ఎన్‌ఓసీ) పత్రాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని సంవత్సరాలుగా ఈ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఎన్‌ఓసీ లేని భూముల్లోనూ ఇతర పట్టాల పేరుతో ప్లాట్లు చేసి అమ్మకాలు జరుపుతూ అక్రమ దందాను కొనసాగించారు.
ఎన్‌ఓసీలపై పేచి..
రెండు మూడు దశాబ్దాలుగా వీటికి ఎన్‌ఓసీలు జారీ అయ్యాయి. అప్పట్లో జిల్లా పాలనాధికారి నుంచి ఈ అసైన్డ్ భూములకు ఎన్‌ఓసీలు జారీ కాగా.. కొన్ని భూములకు జిల్లా సంయుక్త పాలనాధికారి, మరికొన్ని భూములకు ఆర్డీఓ, ఇంకొన్ని భూములకు తహసీల్దార్లు ఎన్‌ఓసీలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిల్లోనూ నకిలీలు ఉన్నాయనే సందేహం వెలిబుచ్చుతూ రెండేళ్ల కిందట అప్పటి ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ జ్యోతి... జిల్లా పాలనాధికారికి నివేదించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు అధికారులకు మూడు నెలలకు పైగా సమయం పట్టింది. ఎట్టకేలకు అప్పటి పాలనాధికారి దివ్యదేవరాజన్ ఎన్‌ఓసీ భూముల్లో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయించారు. 2019 ఆగస్టు 5వ తేదీన దీనికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపించారు. ఫలితంగా దాదాపు ఏడాదిన్నరగా ఇవి నిల్చిపోయాయి..