తెలంగాణ

telangana

ETV Bharat / state

డిమాండ్ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు - తెలంగాణ వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. భూముల విలువ పెరుగుతున్న కొద్దీ అక్రమార్కులు ఆగడాలు ఎక్కువవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం చేసే బడాబాబుల అండదండలు, చోటామోటా నేతల ప్రమేయంతో యథేచ్ఛగా ప్రభుత్వ గైరాన్‌, పోరంబోకు భూములను కబ్జా చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది.

special-story-on-land-mafia-in-adilabad-district
భూమి విలువ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు

By

Published : Dec 21, 2020, 12:51 PM IST

భూముల విలువ పెరుగుతున్న కొద్దీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేసే బడాబాబుల అండదండలు, చోటామోటా నేతల ప్రమేయంతో యథేచ్ఛగా ప్రభుత్వ గైరాన్‌, పోరంబోకు భూములను కబ్జా చేస్తున్నారు. నిలువరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ప్రజల సామాజిక, సామూహిక అవసరాలకు సర్కారీ భూములు కరవై ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతమవుతున్న భూములపై ఈటీవీ భారత్ పరిశీలనాత్మక కథనం.

డిమాండ్ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు

కబ్జాల కారణంగా ప్రజల సామూహిక, సామాజిక అవసరాలైన పాఠశాలలు, ఆస్పత్రులు, పారిశ్రామిక వాడలు, పార్కులు, క్రీడా మైదానాలు, విద్యుత్తు కేంద్రాలు, శ్మశాన వాటికలు, సంఘ భవనాలు నిర్మించడం ఇతరత్రా అభివృద్ధి పనుల కోసం భూములు లేకుండా పోయాయి.

కాగితాలకే పరిమితం..

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను మినహాయించి 1,33,108 లక్షల ఎకరాలు ప్రభుత్వ గైరాన్‌, పోరంబోకు భూములు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా అవన్నీ కాగితాలకే పరిమితయ్యాయి. కొందరు అధికారులతో కుమ్మక్కై వాటిని ప్లాట్లుగా మార్చి క్రయవిక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో బడానేతల ప్రోద్భలంతో వేలాది ఎకరాల ప్రభుత్వ గైరాన్‌, పోరంబోకు భూములు కబ్జాకు గురయ్యాయి.

భూమి విలువ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు

కఠిన చర్యలు తీసుకుంటున్నాం..

"ప్రభుత్వ గైరాన్‌, పోరంబోకు భూముల కబ్జాపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఇంద్రవెల్లి, ఉట్నూరుతోపాటు మరికొన్ని మండలాల్లో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించాం."

- సంధ్యారాణి, జిల్లా అదనపు పాలనాధికారి

  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో సర్వేనం.140లో ఉన్న 9.14 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. అదే జిల్లా కేంద్రంలోని సర్వేెనం.324లోని 22 ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు జిల్లా పాలనాధికారి దృష్టికి రావడంతో వెంటనే ఆ భూమిని ఆర్డీవో స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం తరువాత మళ్లీ అక్రమార్కులు సరిహద్దు రాళ్లను తొలగించి కబ్జాకు పాల్పడుతున్నారు.
  • నిర్మల్‌ జిల్లాలో ఖానాపూర్‌ మండలంలో సర్వేనెం.207లో రెండెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు బోర్డుపెట్టినా అక్రమార్కులు మాత్రం ఆ భూమిని కబ్జా చేయడం గమనార్హం. పెంబి మండలంతో పాటు పస్పుల, మందపల్లి గ్రామాల్లో 20 ఎకరాల గైరాన్‌ భూములు ఆక్రమణకు గురైనా పట్టించుకునే వారే లేరు.
  • ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఎమాయికుంటలోని సర్వేనం.48లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు ఆక్రమించుకున్నారు. ఉట్నూరు మండలంలో సర్వేనం.464లోని 60 ఎకరాలు ప్రభుత్వ గైరాన్‌ (పశువులు మేసేందుకు అవసరమైన)భూమిని కబ్జా చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. నార్నూరు మండలంలో వంద ఎకరాలు, గాదిగూడ మండలంలో 45 ఎకరాల ప్రభుత్వ గైరాన్‌ భూమి అన్యాక్రాంతమైంది.
    డిమాండ్ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు

సర్కారుపై భారం..

  • ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావడంతో సామాజిక అవసరాల కోసం రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం భూములు కొనుగోలు చేస్తుంది. ఉట్నూరులో రూ.10లక్షలు వెచ్చించి భారీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్మిస్తున్నారు. సిరికొండ మండలంలో రూ.5 లక్షలతో భూమి కొనుగోలు చేసి పాఠశాలను నిర్మిస్తున్నారు. జన్నారం మండలం చింతగూడలో రూ.5.50లక్షలతో శ్మశానవాటిక నిర్మాణానికి భూమిని కొనుగోలు చేశారు.

కుమురంభీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని ప్రధాన రహదారికి ఆనుకొని సర్వేనం.166/జిలో ఎకరం ప్రభుత్వ భూమి ఉండగా వాటిని అక్రమార్కులు ఆక్రమించుకున్నారు. అధికారులతో కుమ్మక్కై ప్లాట్లుగా మార్చుకొని సొమ్ము చేసుకున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో హడావుడి చేసి ఆక్రమిత భూమిలో మొక్కుబడిగా బోర్డును పాతి చేతులు దులుపుకొన్నారు.

భూమి విలువ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు

ఇదీ చదవండి:అప్పుడు అనారోగ్య సమస్యలు... ఇప్పుడు ఆ రైతుబిడ్డ ఎందరికో ఆదర్శం!

ABOUT THE AUTHOR

...view details