పత్తి పంట సాగుకు.. ఖండాంతర ఖ్యాతిగడించిన ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా తీసుకొచ్చిన నిబంధనలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పత్తి పంటకు చివరిదశలో వచ్చే (ఫిబ్రవరి, మార్చిలో)వ్యాధి 'పరిగ' (కౌడి) పేరిట.. అధికారులు కొనుగోళ్లను నిరాకరిస్తున్నారు.
తొలుత తేమ.. ఇప్పుడు పరిగ..
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నవంబర్ 6న కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట తేమ శాతం అధికంగా ఉందంటూ సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం.. వ్యాపారులకు కలిసివచ్చింది. క్వింటా పత్తికి రూ.5,550 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తేమ పేరిట వ్యాపారులు మాత్రం క్వింటాకు సగటున రూ.4 వేలు మాత్రమే చెల్లించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిలో తేమ శాతం తగ్గుముఖం పట్టిన తర్వాత సీసీఐ మరలా కొనుగోలు ప్రారంభించింది. ఇదంతా వ్యాపారుల లబ్ధి కోసమే చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.