తెలంగాణ

telangana

ETV Bharat / state

Flood effect: ఉత్తర తెలంగాణపై కుండపోత వర్షం.. ఆ రెండు జిల్లాలు ఆగమాగం

Flood effect: కుండపోత వర్షాలతో ఉత్తర తెలంగాణ ఆగమాగమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులకు గండ్లు పడి, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి నాని ఇళ్లు కూలుతుండటంతో ముప్పు నెలకొంది. ముంపుప్రాంతాల ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Flood effect in Adilabad
Flood effect in Adilabad

By

Published : Jul 13, 2022, 8:07 PM IST

Flood effect: ఎడతెరిపిలేని వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అతలాకుతలం అయ్యింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చెరువులు, జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. జీఎన్​ఆర్ కాలనీ జలదిగ్భందంలో చిక్కుకుంది. మంజులాపూర్ వద్ద నిర్మల్-భైంసా రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. రాకపోకలు స్తంభించాయి. మంచిర్యాలలోని రాళ్లవాగు వరద ఉద్ధృతికి ఎన్టీఆర్ నగర్, రామ్‌నగర్, ఎల్​ఐసీ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాధితులను తెప్పలసాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జైపూర్ మండలం రసూల్‌పల్లిలో లోలెవెల్ వంతెన మీదుగా వరద పోటెత్తుతోంది. మంచిర్యాల- చెన్నూరు మధ్య 63వ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఆసిఫాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బుర్గుడ బీసీ కాలనీ, గుండి, రెబ్బెన మండలం నారాయణపూర్‌లో వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బెల్లంపల్లి ఏరియాలో కురుస్తున్న వర్షంతో పదిరోజుల నుంచి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, తాండూరు మండలాల్లో పత్తి పంట నీట మునిగింది. తాండూరు మండలంలో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. అచలాపూర్, తాండూరు, రేచిని గోపాల్ నగర్, గంపలపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్‌నగర్, రవీంద్రనగర్‌లో పలువురి ఇళ్లు కూలాయి. రాచర్ల, ముల్కలపేట గ్రామాల మధ్య రోడ్డు మునిగిపోవడంతో... అత్యవసర పరిస్థితుల్లో పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది.

ఉత్తర తెలంగాణపై కుండపోత వర్షం.. ఆ రెండు జిల్లాలు ఆగమాగం

ఐదు రోజులుగా దంచికొడుతున్న వానలతో నిజామాబాద్ నగరం జలమయమైంది. కొన్ని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, ప్రధాన రహదారులు నీటితో నిండిపోయి... వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. బోర్గాం శివారులో కూలీల ఇల్లు పూర్తిగా మునిగిపోయాయి. జెండాగల్లిలోని ప్రధాన రహదారిలో కరెంటు తీగలపై చెట్టు విరిగిపడింది. బోధన్‌రోడ్డులో మాలపల్లి వద్ద ప్రధాన రహదారి పూర్తిగా స్తంభించింది. పూలాంగ్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. నిజామాబాద్ కొత్త కలెక్టరేట్‌ ఎదుట ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైపోయింది. మోపాల్ మండలం ముదక్‌పల్లిలోని గాజకుంట తెగిపోవడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఇందల్వాయి చిన్నవాగు తెగిపోవడంతో తండాలకు రాకపోకలు బందయ్యాయి. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని అన్ని చెరువులూ నిండుకుండలను తలపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి, ధర్పల్లి, సిరికొండ మండల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటపొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. సిర్నపల్లి వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో.. సిర్నపల్లి, రాంసాగర్ తాండలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ప్రవాహంతో హోన్నజీపేట్, ముషీర్‌నగర్‌, సిరికొండ సహా పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. బొప్పాపూర్‌-రుద్రూర్ ప్రధాన రహదారిపై వరద ప్రవాహంతో బొప్పాపూర్‌లోనూ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. నందిపేట్ మండలంలోని కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. చిమ్రాజ్‌పల్లి వద్ద అలుగును తవ్వి నీటిని కిందికి వదిలారు. నందిపేటకు మూడువైపులా నీరు చేరింది. రఘునాథ్‌ చెరువు గండిపడడంతో ఆర్మూర్‌కు వెళ్లే రహదారి దిగ్బంధమైంది. మారంపల్లిలో సత్తారు కుంట తెగిపోయింది. పడిగెల చెరువుకు గండి కొట్టి వరద నీటి దారి మళ్లించారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ గ్రామంలో పెద్దచెరువు కట్ట తెగిపోయి వందలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. వరద నీటితో కేశ్‌పల్లి, మనోహరాబాద్, కొలిప్యాక్ గ్రామాలకు ముప్పు ఉంచి ఉండటంతో... అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

నిజామాబాద్ జిల్లా నవీపేట సుభాష్‌నగర్‌లో విద్యుత్తు తీగలపై చెట్టు కూలడంతో స్తంభం విరిగిపోయింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. నలేశ్వర్-నందిపేట రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఎడపల్లీ మండలంలోని పంట పొలాల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. పెగడపల్లి, రెంజల్, సాటపుర్ సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. సాలూర వద్ద మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ప్రయాణాలు ఆగిపోయాయి. హాంగర్గ శివారులో పంట పొలాల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.
ఇవీ చదవండి:నిండుగా గోదారి.. కనులవిందుగా భద్రాద్రి.. సుమనోహర దృశ్యాలు మీరూ చూడండి..

అక్కా అని పిలిచి అర్ధరాత్రి 'ఆమె'పై మృగాడి దాడి.. రెండు కళ్లు పొడిచేసి..

ABOUT THE AUTHOR

...view details