ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. వ్యూహాన్ని చాకచక్యంగా అమలు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో... శనివారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. రెండు రోజుల కిందట ఆసిఫాబాద్ పట్టణం సమీపంలోని చీలేటిగూడకు... మంచిర్యాల, కుముంరంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ వచ్చిన సమాచారంతో... పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో మావోయిస్టులకు చెందిన నాలుగు సంచులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక దళాలతో జల్లెడ..
అనంతరం మహారాష్ట్ర వైపు వెళ్లే కాగజ్‌నగర్, పెంచికల్ పేట్, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతాలను, రహదారులను 8 ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లోని... కొండ వద్ద రాత్రి 10 గంటల సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. భాస్కర్ సహా మరో మావోయిస్టు తప్పించుకున్నారు.