ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం కోడిగుడ్ల వినియోగం పెరిగింది. సాధారణ రోజుల్లో ఒకటి, రెండు ట్రేలు మాత్రమే విక్రయించే కిరాణా కొట్టు యజమానులు సైతం 5 నుంచి 8 ట్రేల గుడ్లను అమ్ముతున్నారు. కరోనా వచ్చి ఐసోలేషన్‌లో ఉంటున్న వారితో పాటు మిగతా కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా భోజనంలో గుడ్డు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి నెలకి ముందు ఉట్నూరు ఏజెన్సీలోని ఆయా మండలాల్లో దాదాపుగా 30 వేల కోడిగుడ్లు అమ్మకాలు జరిగితే, లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 60 వేల నుంచి 75 వేల గుడ్ల విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఏడు రూపాయలైనా.. వెనకడుగు వేయడం లేదు..
గుడ్ల ధరలను నెక్(నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ) నిర్ధారిస్తుంది. ఆ ధరలకు హోల్‌సేల్ దుకాణదారులు విక్రయించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు వాటి ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. కరోనా కారణంగా వినియోగం పెరుగుతుండటంతో ఇదే అదునుగా కొందరు ధరలను పెంచేస్తున్నారు. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6 పలుకుతుండగా, మారుమూల గ్రామాల్లో రూ.7 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ధర పెరుగుతున్నప్పటికీ వినియోగం మాత్రం తగ్గడం లేదు.
పౌష్టికాహారంపై అవగాహన శుభపరిణామం
కరోనా వైరస్ సోకిన వారికి ప్రతిరోజూ రెండు పూటలా గుడ్డు ఇస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారికి సైతం వైద్యులు గుడ్లు ఎక్కువగా తినమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే గుడ్డు కొండెక్కుతోంది. ధరల పెరుగుదల వల్ల ఆర్థిక భారమైనప్పటికీ ఏజెన్సీలో పౌష్టికాహారంపై అవగాహన ఏర్పడటం శుభపరిణామం.