తెలంగాణ

telangana

ETV Bharat / state

జ్వరాలతో అల్లాడిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల దోమలు స్వైరవిహారం చేస్తుండడం వల్ల... ప్రజలు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అటు చాప కింద నీరులా డెంగీ ప్రబలి... జిల్లావాసులను కలవరపెడుతోంది. రోగాలతో సామాన‌్యులు ఇబ్బందులు పడుతున్న వేళ... అధికారులు, రాజకీయ నేతల ప్రకటనలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

adilabad dengue

By

Published : Sep 26, 2019, 11:24 PM IST

జ్వరాలతో అల్లాడిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా

గిరిపుత్రుల జిల్లా జ్వరాలతో గజగజలాడుతోంది. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన డెంగీ వ్యాధి... నేడు పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా విజృంభిస్తోంది. ఫలితంగా వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలోని 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 31 డెంగీ కేసులు నమోదవగా... ఆదిలాబాద్ పట్టణ పరిధిలో 28 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ యువకుడు డెంగీ బారిన పడి మృత్యువాత పడడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వశాఖల మధ్య అవగాహన లేకపోవడం వల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైద్యులు సరిగా స్పందించడం లేదని బాధితుల ఆందోళన

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో చేసిన ఓ సర్వేలో... 5,960 మంది జ్వర పీడితులని తేలింది. ఇందులో 532 మందికి టైఫాయిడ్‌.... 679 మందికి అతిసారం ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్​సీల్లో.. వైద్యులు సరిగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు.

డెంగీ పేరిట దోచుకుంటున్నారు!

విషజ్వరాల నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సత్వర చికిత్సలు అందిస్తున్నామని అంటున్నారు. డబ్బుల కోసమే ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ పేరిట నిరుపేదలను దోచుకుంటున్నాయని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అన్ని జ్వరాలు డెంగీ జ్వరాలు కాదని... ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాధుల నియంత్రణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆ పోలీసాయన జీవితంలో 17 నంబరు ప్రత్యేకం​...

ABOUT THE AUTHOR

...view details