ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పంటలకు మొలక దశలోనే నష్టం వాటిల్లుతోంది. ఖరీఫ్ ఆరంభంలో అనుకూలంగా ఉన్నాయనుకున్న వానలు... ఇప్పుడు ఉగ్రరూపం దాల్చడంతో రైతులకు శరాఘాతంగా మారింది. కుమురంభీం జిల్లాలో 43,601 ఎకరాల్లో పంటలు నీటమునగాయి.
వరద పాలైన పంట
ఆదిలాబాద్ జిల్లాలో మరో 15,380 ఎకరాల్లో పంట వరద పాలైంది. ప్రధానంగా వాంకిడి, ఆసిఫాబాద్, దహేగాం, కాగజ్‌నగర్, తిర్యాణి, నేరడిగొండ, బోథ్, సిరికొండ, బజార్ హత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వరదల ఉద్ధృతికి గుట్టలు, పొలాలు కోతకు గురవడం వల్ల పంట చేలల్లోకి భారీగా నీరు చేరింది. కొన్ని చోట్ల ఇసుక మేటలు పెట్టడం.. నష్టానికి కారణమైంది.
ఈ రెండు మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు మా పంట అంత వరద పాలైంది. మాకు రెండున్నర భూమి ఉంది. అందులో పంటకు 75వేల వరకు ఖర్చు చేశాం. అదంతా నీటి పాలైంది. ఈసారి వర్షాలు మస్తు పడ్డాయి.
- భిక్షు, రైతు, ఆదిలాబాద్ జిల్లా
మా పంట అంతా వరదకు కొట్టుకుపోయింది. పంట నీటమునిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇట్లాంటి వర్షం ఎప్పుడూ పడలేదు. బ్యాంకులో లోన్ తీసుకున్నా... ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదు.