Crop Damage in Adilabad Due to Floods: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ ఆరంభమే కష్టాలతో మొదలైంది. ఇది చాలదన్నట్లుగా తాజాగా వచ్చిన వరదల తాకిడికి పత్తి, సోయా పంటలకు అపారనష్టం జరిగింది. అసలే వర్షాధారంగా నడిచే సాగును అదే వాన కోలుకోలేని దెబ్బతీసింది. ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్ జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీటిమునిగింది. నష్టం ఎంత అనేది ఇప్పటికిప్పుడే తెలిసే అవకాశం లేనప్పటికీ... కోతకు గురైన పొలాల్లో మరో పంట వేసే పరిస్థితి కనిపించడం లేదు. నదీ పరివాహాక ప్రాంతాల్లోని పంటచేలల్లో ఇసుక మేటలు పెట్టడం, బండరాళ్లు దర్శనమివ్వడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
Adilabad Floods 2023 :ఖరీఫ్ సీజన్ జూన్ మాసంలో ప్రారంభం కావాల్సి ఉండగా సకాలంలో వర్షాలు రాక... జులై మొదటివారంలో ప్రారంభమైంది. అడపా దడపా వానలతో అప్పటికే విత్తనాలు వేసిన రైతులు జులై 25 తర్వాత వచ్చిన వరదల కారణంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సాత్నాల, మత్తడివాగు, ఆడ జలాశయాల వరదతోపాటు పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగు నదీపరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ప్రాజెక్టుల నిర్వహణ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటంతో పంటలు కోల్పోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
Korutla Flood Problems 2023 : వరద గుప్పిట్లో కోరుట్ల.. దిక్కు తోచని స్థితిలో ప్రజలు
'' వర్షాలు రాకున్నా బాధే, వర్షాలు వచ్చినా వరదలతో ఇంకా పెద్ద బాధ. ఈసారి వచ్చిన వరద భారీ నష్టం కలిగించింది. నిండుకుండలా మారిందని.. ప్రాజెక్టుల్లోని గేట్లు అన్ని ఒక్క సారిగా తెరిచారు. ఆ వరదల ధాటికి పంటలు అన్ని కొట్టుకుపోయాయి. ప్రాజెక్టుల నిర్వహణ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటంతో పంటలు కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వం మాకు తగిన పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం.'' - రైతులు