cotton farmers protest: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారుల తీరు కొనుగోళ్ల ఆరంభం నుంచి వివాదానికి దారితీస్తోంది. తొలి రోజున క్వింటాలుకు రూ.7,920తో కొనుగోళ్లు ప్రారంభించిన వ్యాపారులు ఆ తర్వాత ఆధరను రూ.8,540 వరకు పెంచారు. ఆ తర్వాత తగ్గిస్తూ వస్తున్నారు. శుక్రవారం క్వింటాలుకు రూ.8130 ధర నిర్ణయించిన అధికారులు ఈరోజు ఆ ధరను రూ.7.960కి తగ్గించారు. క్వింటాలుకు రూ.170 తగ్గించడంతో భారీగా పత్తి వాహనాలతో తరలివచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్‌ను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. వ్యాపారులు పత్తి బండ్లు చూసి ధర తగ్గించారని, బయట మార్కెట్‌లలో ధర క్వింటాలుకు రూ.8వేలు పైచిలుకు పలుకుతుండగా.. ఇక్కడ మాత్రం వ్యాపారులు తమను మోసం చేయాలని చూస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి తమకు అధిక ధరవచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.
డీజిల్ బాటిళ్లతో ధర్నా
యార్డు గేటును మూసిన రైతులు పట్టణంలోని కిసాన్‌చౌక్ సమీపంలోని జాతీయరహదారిపై దాదాపు ఐదుగంటల నుంచి ఆందోళన చేస్తున్నారు. జాతీయరహదారిపై ఎడ్ల బండ్లు ఉంచి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు రైతులు డీజిల్ బాటిళ్లను చేతపట్టుకుని ఆందోళనలో పాల్గొనడం... వారిని పోలీసులు అడ్డుకోవడం తోపులాటకు దారితీసింది.
అధికారులు రావాలని డిమాండ్
వన్‌టౌన్ సీఐ రామకృష్ణపై డీజిల్ పడటంతో పోలీసులు రైతులను వారించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, రైతుల తోపులాటతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో కిసాన్‌చౌక్ దద్దరిల్లింది. రైతులు గంటల తరబడి ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు రైతుల ఆందోళన వద్దకు రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ధర పెంచేవరకు తమ ఆందోళన ఆపేదిలేదని రైతులు స్పష్టం చేశారు.
ఎట్ల బతకాలె..
క్వింటాలుకు రూ.8130 ధర ఉందంటే మేము ఇక్కడికి వచ్చినం. వచ్చిన బండ్లను చూసి వెంటనే దాదాపు 200 రూపాయలను ధరను తగ్గించారు. సరిగా 8వేలు కూడా ధరలేదు. పంట పండించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. మేము ఎట్లా బతకాలె. -సలీం, రైతు, ఆదిలాబాద్ జిల్లా
వాళ్ల ఇష్టమేనా?