ఖాతాదారునికి తెలియకుండానే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా అయిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. సిబ్బందే ఈ పని చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేంటని ప్రశ్నించిన ఖాతాదారులను పట్టించుకోలేదు. గేటుకు తాళం వేసి విషయం బయటకు పొక్కకుండా భయపెట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు బ్యాంకులో ఆరాతీయడంతో అసలు విషయం బయటపడింది.
డబ్బులు నొక్కేసిన బ్యాంకు సిబ్బంది - withdraw
ఖాతాదారుని అనుమతి లేకుండా అకౌంట్లోని సొమ్మును బ్యాంక్ సిబ్బంది నొక్కేశారు. కేసు పెడతామని ఖాతాదారుడు బెదిరించే సరికి దారికొచ్చాడు.
ఆదిలాబాద్‌లోని టీచర్స్ కాలనిలో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచిలో కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా వైద్యురాలు... ఈనెల ఒకటో తేదీన రూ. లక్షా 64 వేల నగదు డ్రా చేయడానికి బ్యాంకుకు వచ్చారు. అంత డబ్బు చెక్కు ద్వారా తీసుకోవాలని అక్కడి సిబ్బంది సూచించారు. చెక్కు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటుండగానే.. ఆమెకు తెలియకుండా ఆమె ఖాతాలోంచి బ్యాంకు సిబ్బంది మూడువేల రూపాయలు డ్రా చేసుకున్నారు. ఆ తరువాత ఆమె తనకు కావాల్సిన డబ్బు డ్రా చేసుకున్నారు. ఇంటికి వెళ్లిన తరువాత తొలుత రూ. 3వేలు, ఆ తరువాత లక్షా 64వేలు డ్రా చేసుకున్నట్లుగా ఆమె ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. మరుసటి రోజు ఇదేంటని బ్యాంకులో ప్రశ్నిస్తే... తమకు తెలియదని చెప్పి వెనక్కి పంపించారు. రెండు రోజులైనా బ్యాంకు సిబ్బంది తిరిగి డబ్బు జమ చేయకపోవడంతో మళ్లీ బ్యాంకుకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించడంతో వాగ్వాదానికి దారితీసింది. విషయం తెలసుకున్న ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు బ్యాంకుకు వెళ్లగా.... పొరపాటు జరిగిందని అంగీకరించిన మేనేజర్... ఎవరు చేశారని చెప్పడానికి అంగీకరించలేదు. ఈ వివాదం జరుగుతుండగానే బాధితురాలి ఖాతాలోకి రూ. మూడు వేలు వెంటనే జమ చేయడం విశేషం.