సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఆధ్వర్యంలోని ఏజెన్సీ వైద్యశాఖ పరిధిలోని ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాలను కలుపుకొని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఆరోగ్య ఉపకేంద్రాలు, 03 సామాజిక ఆసుపత్రులు, 12 మలేరియా సబ్‌యూనిట్లు నడుస్తున్నాయి. వాటి ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లోని మండల కేంద్రాలతోపాటు మారుమూల గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించాల్సి ఉన్నా సరిపడా వైద్యులు, సిబ్బంది లేక గిరిపుత్రులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది.
ఖాళీలు, డిప్యుటేషన్లతో సతమతం..
ఏజెన్సీ వైద్యశాఖ ఒకవైపు ఖాళీలు మరోవైపు డిప్యుటేషన్లతో సతమతమవుతోంది. వెరసి వైద్యసేవలు అటకెక్కుతున్నాయి. మొత్తం 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 73 వైద్యుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 48 మంది పనిచేస్తున్నారు. మిగతా 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 08 కమ్యూనిటీ ఆరోగ్య అధికారి పోస్టులకు ముగ్గురు మాత్రమే ఉన్నారు. 29 పురుష, 64 మహిళా బహుళార్ద ఆరోగ్య సేవకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*ఉట్నూరులోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేయాల్సిన అయిదుగురు వైద్యనిపుణులు రిమ్స్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. మరోఇద్దరు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్నారు.
*నార్నూరు మండలంలో ఇటీవల కొత్తగా 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఇక్కడ అయిదుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒకే ఒక్క డాక్టరుతో సరిపెట్టారు. డాక్టరు సెలవుల్లోకి వెళ్తే వైద్యం అందని పరిస్థితి.
*దంతన్‌పల్లి గ్రామంలో 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇక్కడ ఇద్దరు వైద్యులు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. మరొకరికి కుష్టు నియంత్రణ విభాగంలో డిప్యుటేషన్‌పై నియమించడం వల్ల ఇక్కడ 24 గంటలు వైద్యసేవలు అందడం లేదు.
*హస్నాపూర్ పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండగా వారిలో ఒకరికి హైదరాబాద్‌కు డిప్యుటేషన్‌పై పంపించారు. శ్యాంపూర్, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఝరి, భీంపూర్, పిట్టబొంగారం పీహెచ్‌సీల నుంచి ఒకొక్కక్క వైద్యాధికారికి మరొక చోటుకి డిప్యూటేషన్లపై నియమించారు.
ఇంటింటా బాధితులే..
ఏజెన్సీ వైద్యశాఖ ఇంటింటా వ్యాధిగ్రస్థుల వివరాలను సేకరించేందుకు నిర్వహించిన సర్వేలో ఇప్పటి వరకు 18,728 మందికి జ్వరాలు, 23 మందికి మలేరియా, మరో 23 మందికి డెంగీ వంటి విషజ్వరాలు సోకినట్లు గుర్తించారు. ఇవన్నీ అధికారిక లెక్కలు కాగా అనధికారికంగా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని సమాచారం.
పట్టించుకోని ఐటీడీఏ..
ఏజెన్సీలో విషజ్వరాలు పడగ విప్పుతున్నాయి. ఇప్పటికే కొందరు మృత్యువాతపడగా అనేక మంది అనారోగ్యం బారినపడి ఇబ్బందిపడుతున్నారు. వైద్యులు సిబ్బంది కొరత, డిప్యుటేషన్లతో ఆ శాఖ సతమతమవుతోంది. పరికరాలు పనిచేయక వ్యాధుల నిర్ధారణకు ఇబ్బందిగా ఉంది. సమస్యలతో ఏజెన్సీ వైద్యశాఖ కునారిల్లుతోంది. పర్యవేక్షించి చక్కబెట్టాల్సిన ఐటీడీఏ అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించి వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఉట్నూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు