కుమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రజలతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆదివాసీ నాయకులు పోడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ భేటీలో మంత్రితో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి గోడం నగేశ్, ఎమ్మెల్యే కోనప్ప పాల్గొన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న పోడు భూముల సమస్య గురించి గతంలోనే స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇప్పుడు ఏమి చేయలేమని, ఎన్నికల అనంతరం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకుని తనను గెలిపించాలని తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కోరారు.