అధికారుల పర్యవేక్షణ లేక ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చేపట్టిన రహదారుల్లో నాణ్యత లోపించింది. జైనథ్ మండలంలోని దీపాయిగూడ నుంచి పెన్‌గంగ వరకు నిర్మాణ పనులు చేపట్టడంతో రహదారుల్లో నాణ్యత లోపించి అనతి కాలంలోనే పగుళ్లు తేలడం వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది. తక్కువ రోజుల వ్యవధిలోనే గుత్తేదారులు రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. అసలే వర్షాకాలం జోరుగా వానలు కురిస్తే పగుళ్లు ఏర్పడ్డ చోట గుంతలు పడే అవకాశముంది. కొన్ని నెలల కితం రూ. 10 కోట్లతో 5.2 కిలో మీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆనంద్‌పూర్ నుంచి దిగ్రస్ వెళ్లే దారిలో పూర్తయిన కొన్ని నెలల వ్యవధిలోనే వేసింది వేసినట్టు రహదారిపై తారు లేచిపోయింది. నాసిరకంగా పనులు చేయడంతో పూర్తయిన నాటి నుంచి పగుళ్లు ఏర్పడ్డాయి. విస్తరణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు.
చిన్న వర్షానికే ప్రమాదకరంగా గుంత
నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ కాల్చకుంటాల, మాదాపూర్ వాగ్ధారి గ్రామాల ప్రజల ప్రయాణ, రవాణా సౌకర్యార్థం వెంకటాపూర్ గ్రామ సమీపంలో వంతెన నిర్మించారు. ఇటీవల పనులు పూర్తయ్యాయి. చిన్న వర్షానికే వంతెనకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా గుంత పడింది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయినా ఈ మార్గంలో ప్రయాణించడానికి వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తయి రెండు నెలలు కూడా గడువకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పరిస్థితి ఏంటని ప్రయాణికులు వాపోతున్నారు.