Adilabad DMHO : మహబూబ్‌నగర్‌లో అదనపు డీఎంహెచ్‌వోగా పనిచేసిన డా.కృష్ణారావుకు గతేడాది మార్చిలో ఆదిలాబాద్ డీఎంహెచ్‌వోగా పదోన్నతి లభించింది. గతేడాది మార్చి 26న ఆయన డీఎంహెచ్‌వోగా బాధ్యతలను చేపట్టారు. జిల్లాలో రెండురోజుల పాటు విధులు నిర్వహించిన తర్వాత.. హైదరాబాద్‌లో తనకున్న పరపతిని వినియోగించుకుని తిరిగి మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జీ డీఎంహెచ్‌వోగా డిప్యూటేషన్‌పై వచ్చారు. అప్పటి నుంచి ఆయన రెగ్యులర్ డీఎంహెచ్‌వోగా ఆదిలాబాద్ జిల్లాలో వేతనం పొందుతున్నప్పటికీ విధులు మాత్రం మహబూబ్‌నగర్‌లోనే నిర్వర్తిస్తున్నారు. జీతం ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉన్నందున ఆయన విధుల్లో చేరిన ప్రారంభంలో రెండు రోజులు మినహాయిస్తే తిరిగి ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా ముఖం చూడలేదు.
ఆదిలాబాద్ జిల్లా రెగ్యులర్ డీఎంహెచ్‌వోగా డా.చందు 2020 మే 31న పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో 2020 జూన్ ఒకటో తేదీన బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నరేందర్ రాఠోడ్‌ను ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా రాష్ట్ర వైదారోగ్యశాఖ నియమించింది. అయితే రెగ్యులర్ డీఎంహెచ్‌వోగా డా.కృష్ణారావు నియమితులైనప్పటికీ ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల నరేందర్ రాఠోడ్‌నే కొనసాగించాల్సి వస్తోంది. బోథ్ ఆసుపత్రి సూపరిటెండెంట్‌గా అక్కడి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డా.రవీందర్‌కు ఇన్‌ఛార్జీ బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది. ఒకవేళ కృష్ణారావు డీఎంహెచ్‌వోగా విధుల్లో చేరితే డా.నరేందర్ రాఠోడ్ బోథ్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, ఉట్నూర్ అదనపు జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వహించడం, బోథ్ ఇన్‌ఛార్జీ సూపరింటెండెంట్‌గా ఉన్న డా. రవీందర్ ప్రసాద్ తన బాధ్యతల నిర్వహణకు మార్గం సుగమనమవుతుంది.
వీరూ ఇన్‌ఛార్జీలే
ఇప్పటికే ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత కీలకమైన ఉట్నూర్ అదనపు జిల్లా వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. అక్కడ పనిచేసిన డా. బాలు... జిల్లాల పునర్విభజనలో భాగంగా కుమురంభీం జిల్లా ఇన్‌ఛార్జీ డీఎంహెచ్‌వోగా బదిలీ అయ్యారు. అక్కడ ఆయన విధుల నిర్వహణ వివాదాస్పదం కావడంతో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసింది. ఆ తర్వాత వైద్యారోగ్యశాఖ ఆయనకు మంచిర్యాల జిల్లా డీఎంహెచ్‌వోగా నియమించింది. ఖాళీగా ఉన్న ఉట్నూర్ అదనపు డీఎంహెచ్‌వోగా... వైద్యారోగ్యశాఖ కార్యక్రమాల శిక్షణాధికారి డా.మనోహర్‌కు ఇన్‌ఛార్జీ బాధ్యలను అప్పగించింది. క్షయనియంత్రణ, ఇమ్యూనైజేషన్ అదనపు డీఎంహెచ్‌వోలను ఇన్‌ఛార్జీలతో కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం కాలానికి అనుగుణంగా వ్యాధులతో సతమతమవుతున్నప్పటికీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పట్టించుకోవడంలేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మొన్నటి వరకు డయేరియా, డెంగీ, తాజాగా మూడోదశ కరోనాతో సతమతమవుతోందనుకుంటే రెగ్యులర్ అధికారులు లేకపోవడం సిబ్బంది విధుల నిర్వహణపై స్పష్టమైన ప్రభావం చూపుతోంది. దీనికి తోడు జిల్లా ప్రజాప్రతినిధులు నోరుమెదపకపోవడం ఇన్‌ఛార్జీ అధికారులకు అన్ని విధాలుగా కలిసివస్తోంది.