Adilabad DCCB: ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు (DCCB) బేల బ్రాంచిలో వెలుగుచూసిన 2 కోట్ల 86లక్షల రూపాయల కుంభకోణం కేసు సీఐడీ దృష్టికి వెళ్లింది. బ్యాంకు సొమ్ము దుర్వినియోగంలో భాగస్వాములైన 11 మంది ఉద్యోగులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన డీసీసీబీ... తాజాగా సీఐడీకి ఫిర్యాదు చేసింది.
11 మంది సస్పెండ్..
డీసీసీబీ బేల బ్రాంచిలో స్టాఫ్ అసిస్టెంట్ కం క్యాషియర్‌గా పనిచేస్తున్న శ్రీపతికుమార్ ప్రధాన సూత్రధారిగా 2 కోట్ల 86 లక్షల 40 వేల రూపాయల దుర్వినియోగానికి పాల్పడడం రాష్ట్ర సహాకార వ్యవస్థలోనే సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ప్రధాన సూత్రదారుడైన శ్రీపతికుమార్, బేల బ్రాంచి మేనేజర్ రాజేశ్వర్, అసిస్టెంట్ మేనేజర్ రణిత సహా ఆదిలాబాద్ ప్రధాన కార్యాలయం, జన్నారం, భీంపూర్ బ్రాంచిల్లో పనిచేసే 11 మందిని సస్పెండ్ చేసింది. ఆర్‌బీఐ, నాబార్డు నిబంధనల ప్రకారం జిల్లాస్థాయిలో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేల పోలీసు స్టేషన్‌లో నమ్మక ద్రోహం, మోసం కింద కేసు నమోదవగా మంగళవారం నుంచి విచారణ ప్రారంభమైంది.