ఈమె ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ గ్రామానికి చెందిన శాబంతుల కౌసల్య. తొమ్మిది మంది సంతానంలో ముగ్గురు పుట్టగానే చనిపోయారు. మిగతా వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఏడాది క్రితం కౌసల్య ఆరోగ్యం క్షీణించి మూడు నెలలు పాటు మంచానికే పరిమితమైపోయింది. ఇతరుల సాయం లేనిదే లేచి కూర్చోలేని పరిస్థితి. తిండి మానేయడం వల్ల ఓ దశలో ఆమెపై కుటుంబసభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. అయితే ఏడాది వ్యవధిలోనే అనూహ్యంగా ఆమె కోలుకున్న తీరు వారిని ఆశ్చర్యపరిచింది. సొంతంగా తన పనులు చేసుకోవడంతో పాటు హుషారుగా ఇంటి పనులు సైతం చేస్తూ ఔరా అనిపిస్తోంది. తన మనవడి సహకారంతో యోగా, ధ్యానం చేయడం ప్రారంభించిన కౌసల్య..... ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటూ అవలీలగా వేస్తున్న ఆసనాలు అబ్బురపరుస్తున్నాయి.
ఉదయం 4గంటలకే నిద్రలేవడం
రోజూ ఉదయం 4గంటలకే నిద్రలేచే ఈ బామ్మ.... గంట సేపు యోగ చేసిన తర్వాతే దైనందిన పనులకు ఉపక్రమిస్తుంది. మాంసం అంటే రుచి ఎరగని బామ్మ.... శాఖాహారం తప్ప వేరేవి తీసుకోదు. ఎనభై ఏళ్లొచ్చినప్పటికీ ఏనాడు కళ్లద్దాలు ధరించే అవసరం రాలేదంటారామె. ధ్యానముద్రతో మొదలయ్యే ఆసనాలు... గ్రైండింగ్, హలాసనం, మండుకాసం, సర్వాంగాసనం, పాదముక్తాసనం, గరుడాసనం, చక్రాసనం... ఇలా పదిహేను రకాల ఆసనాలను అలుపెరగకుండా చేస్తుంది. యోగా చేయడం ఆరంభించినప్పటి నుంచి ఏనాడు ఆసుపత్రి వైపు చూడలేదంటారు బామ్మ. తన మనవడు నేర్పిన యోగసనాలు చేస్తూ ఆనందంగా ఉంటున్నానని చెబుతున్నారు.