ఆదిలాబాద్ జిల్లాలో మరో 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యారోగ్యాధికారులు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకొని 11 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 41 మంది రిమ్స్ ఐసోలేషన్‌లో, ఇద్దరు ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఒకరు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో, 232 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్సలు పొందుతున్నారు. మంగళవారం 161 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించారు. పరీక్షించాల్సిన నమూనాలు 89 ఉన్నాయి.
ప్రాంతాల వారీగా..:
అశోక్‌రోడ్డు, భుక్తాపూర్, బొక్కలగూడ, హనుమాన్‌నగర్, కైలాస్‌నగర్, క్రాంతినగర్(మహిళ), మహాలక్ష్మీవాడ, మసూద్‌నగర్, నేతాజీకూడలి, సంజయ్‌నగర్, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, బజార్‌హత్నూర్, బోథ్, జాతర్ల (బజార్‌హత్నూర్ మండలం)లో ఒక్కొక్కరికి, రిమ్స్ క్వార్టర్లలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యాధికారి రాఠోడ్ నరేందర్ ప్రకటించారు.
డీఆర్‌డీఏ కార్యాలయంలో..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తాజాగా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పురపాలక సిబ్బందితో కార్యాలయంలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు.
బేలలో ఓ బ్యాంకు మేనేజర్‌కు కొవిడ్..
బేల మండల కేంద్రంలోని ఓ బ్యాంకు మేనేజర్‌కు కరోనా వచ్చింది. ఆదిలాబాద్‌లోని దస్నాపూర్ కాలనీలో ఉంటున్న ఆయన అనుమానిత లక్షణలతో రిమ్స్‌లో పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ వచ్చిందని ఇన్‌ఛార్జీ మేనేజర్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. శుక్రవారం విధులకు హాజరుకాగా శనివారం నుంచి సెలవులో ఉన్నారు. పాజిటివ్ నిర్థరణ కావడంతో నేడు, రేపు బ్యాంకుకు సెలవు ప్రకటిస్తూ బ్యాంకు ముందర బోర్డు పెట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంకులో ముగ్గురికి కరోనా నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు.