ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌లో సింధు ఓటమిపాలైంది. ఇక రెండో గేమ్‌లోనూ మరింత పట్టుదలగా ఆడిన తై జు.. భారత షట్లర్‌కు ఏ అవకాశం ఇవ్వలేదు. దాంతో సింధు రెండు వరుస గేమ్స్‌లో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా సింధు పతకం సాధించేందుకు మరో అవకాశం ఉంది. మరో సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైన చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోతో ఆదివారం సాయంత్రం తలపడనుంది. అక్కడ గెలిస్తే సింధు కాంస్యం సాధించే అవకాశం ఉంది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో ఈ స్టార్ షట్లర్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు తై జు యింగ్ చేతిలో సింధూకు ఇది 14వ ఓటమి కావడం గమనార్హం. ఇప్పటివరకు వీరిద్దరూ 19 సార్లు తలపడగా సింధు 5 సార్లు మాత్రమే ఆమెపై విజయం సాధించింది. అలాగే ఇటీవల పోటీపడిన గత మూడు పోటీల్లోనూ తై జు చేతిలో పరాభవం ఎదుర్కొంది. కాగా, సింధు శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగూచిపై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ సింధు 21-13, 22-20తో గెలుపొందింది. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ సెమీస్‌లో అడుగుపెట్టిన స్టార్ షట్లర్ అనూహ్య రీతిలో ఓటమిపాలైంది.