ఒలింపిక్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్, చైనా ఆటగాడు మా లాంగ్‌తో జరిగిన మ్యాచ్‌ను తన కెరీర్లోనే ఉత్తమమైన పోరుగా అభివర్ణించారు భారత టెబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్. జులై 27న జరిగిన ఈ పోరులో 11-7, 8-11, 13-11, 11-4, 11-4 తేడాతో శరత్ ఓడినప్పటికీ.. తన పోరాట పటిమతో హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా ఒలింపిక్స్‌పై 'ఈటీవీ భారత్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు శరత్ కమల్.
ప్రశ్న: లాంగ్‌ను మీరు ఒత్తిడిలోకి నెట్టగలిగారు. విజయావకాశాలు మీకు ఎక్కువగా కనపించాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎలా సన్నద్ధమయ్యారు?
క్లిష్టమైన డ్రా రావడం వల్ల టోర్నీ కఠినంగా ఉంటుందని ముందే అర్థమైంది. రౌండ్ 2లో అపొలొనియాతో పోరు జరిగింది. అతనిని నేను 15ఏళ్లల్లో ఒక్కసారి కూడా ఓడించలేదు. ఇక ఆ తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ మా లాంగ్‌తో జరిగింది. గెలిచే అవకాశం 50/50 అని మ్యాచ్‌కు ముందే అర్థమైంది. కానీ ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. నేను గెలవడం కోసమే వచ్చానని అవతలి వ్యక్తికి తెలిసేలా చేద్దాం అనుకున్నా. నన్ను ఓడించాలంటే, నాకన్నా మెరుగ్గా ఆడాల్సి ఉంటుందని అర్థమయ్యేలా చేశాను. అదే ఉద్దేశంతో మ్యాచ్‌లోకి వెళ్లా. మూడో రౌండ్ గెలిచి ఉంటే, ఆ తర్వాత మ్యాచ్ సొంతమయ్యేది. కానీ గెలవలేకపోయాను. లాంగ్‌పై ఒత్తిడి తీసుకురాగలిగాను. ముప్పుతిప్పులు పెట్టాను. కానీ పూర్తి పట్టుసాధించలేకపోయాను. ఏదేమైనా.. లాంగ్‌ను ఒత్తిడిలోకి నెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ప్రశ్న: చివరి రెండు సెట్లలో ఏం జరిగింది? మ్యాచ్.. అప్పటివరకు ఒక విధంగా.. ఆ తర్వత ఇంకో విధంగా సాగింది. ఎందుకిలా?
అవును.. చివరి రెండు సెట్లను పరిశీలిస్తే అంతే. అప్పుడు స్కోర్‌బోర్డును చూస్తే, లాంగ్ నాపై పూర్తి ఆధిపత్యం చేలాయించారని అందరూ అనుకుంటారు. మ్యాచ్‌ని పూర్తిగా చూసినవారికే దాని తీవ్రత అర్థమవుతుంది. నాలుగు, ఐదు రౌండ్లలో లాంగ్ బాగా ఆడారు. తనపై ఒత్తిడిని తగ్గించుకుని, మంచి షాట్లు కొట్టారు. ఆ సమయంలో అతికష్టం మీద నేను నాలుగు పాయింట్లు సాధించా. నేను ఆడిన మ్యాచ్‌లో ఇది అత్యంత ఉత్తమమైనది.