ఆర్చరీ పోటీలు జరగడం.. దక్షిణ కొరియా ఆర్చర్లు పతకాలు మెడలో వేసుకుని వెళ్లడం.. దాదాపు అర్ధశతాబ్దం నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో కనిపించే దృశ్యాలివి. 1972 ఒలింపిక్స్‌లో ఆధునిక ఆర్చరీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆ ఆర్చర్ల బాణాలు పతకాలు సాధిస్తూనే ఉన్నాయి. ఏదైనా ఓ క్రీడలో ఓ దేశం కొన్నేళ్ల పాటు ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆ తర్వాత దానికి ఓటమి పరిచయం చేసే మరో దేశం వస్తుంది. కానీ ఆర్చరీలో మాత్రం దక్షిణ కొరియాను కొట్టే దేశమే రావట్లేదు. టోక్యోకు ముందు వరకూ 10 ఒలింపిక్స్‌ల్లో తమ ఆర్చర్లను బరిలో దింపిన ఆ దేశం ఏకంగా 39 పతకాలు సాధించింది. అందులో 23 స్వర్ణాలున్నాయంటే ఆ క్రీడలో ఆ దేశ ఆర్చర్ల ఆధిపత్యం ఎలాంటిదో స్పష్టమవుతోంది.
మహిళల, పురుషుల జట్లు.. వ్యక్తిగత విభాగాలు, మిక్స్‌డ్ టీమ్ ఇలా ఏ పతకాంశమైనా ఆ ఆర్చర్ల ముద్ర పడాల్సిందే. ఒలింపిక్స్ చరిత్రలో ఆ దేశానికి అత్యధిక పతకాలు వచ్చింది ఆర్చరీలోనే. ఇప్పుడు టోక్యోలోనూ మళ్లీ పాత దృశ్యాలే పునరావృతమవుతున్నాయి. వాళ్ల బాణాలకు పతకాలు సలామ్ కొడుతున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకూ కొరియా గెలిచిన మూడు స్వర్ణాలు ఆర్చరీలో వచ్చినవే. పురుషుల, మహిళల జట్టు విభాగాల్లో ఛాంపియన్‌గా నిలిచిన ఆ దేశం.. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ అగ్రస్థానాన్ని అందుకుంది. తాజాగా సోమవారం పురుషుల జట్టు ఫైనల్లో కొరియా 6-0 తేడాతో చైనీస్ తైపీని చిత్తుచేసింది. ఈ విభాగంలో ఆ దేశం ఆరోసారి ఒలింపిక్స్ పసిడిని ముద్దాడింది. మరోవైపు అమ్మాయిల జట్టు వరుసగా తొమ్మిదో ఒలింపిక్స్ స్వర్ణాన్ని గెలిచింది. తమ దేశంలో ఆర్చరీ మేధావిగా పేరు తెచ్చుకున్న 17 ఏళ్ల కుర్రాడు కిమ్.. కొరియా మిక్స్‌డ్ టీమ్, పురుషుల జట్టు విభాగంలో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యంత పిన్న వయస్సులో ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన దక్షిణ కొరియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన అతను ఆ దేశ ఆర్చరీ భవిష్యత్‌పై ఆశలు కల్పించాడు. ఇంకా పురుషులు, మహిళల వ్యక్తిగత విభాగాల్లోనూ బరిలో ఉన్న ఈ కొరియా ఆర్చర్లు స్వర్ణాల క్లీన్‌స్వీప్ చేసేలా కనిపిస్తున్నారు.