టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్పోర్ట్ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్ అంటిల్(Sumit Antil) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దిల్లీ చేరుకున్న వారిలో సుమిత్తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా(Devendra Jhajharia Javelin Throw), యోగేశ్ కథునియా(డిస్కస్ త్రో).. కాంస్య పతక విజేత శరద్ కుమార్(హైజంప్) ఉన్నారు.
ఆ నలుగురు అథ్లెట్లకు సాయ్(SAI) అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. క్రీడాకారులకు పూలమాలలు, పుష్పగుచ్ఛాలు అందించారు. అథ్లెట్లు తమ పతకాలతో ఫొటోలకు పోజులిస్తుండగా.. అభిమానులు త్రివర్ణ పతాకాలను చూపిస్తూ క్రీడాకారులను అభినందించారు.