తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: నిరాశపరిచిన బైల్స్​.. చరిత్ర సృష్టించిన పోలెండ్​

టోక్యో ఒలింపిక్స్ నిరాటంకంగా జరుగుతున్నాయి. ఆటగాళ్లు తమ ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారు. అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ తమ అభిమానులను నిరాశపరచగా.. చైనా వెటరన్‌ వెయిట్‌లిఫ్టర్‌ యు జియాజున్‌ లేటు వయసులో పసిడి పట్టాడు. అటు.. ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన ట్రయథ్లాన్‌ మిక్స్‌డ్‌ రిలే స్వర్ణాన్ని బ్రిటన్‌ సొంతం చేసుకుంది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగులో పసిడిని పోలెండ్​ దక్కించుకొని ఆశ్చర్యానికి గురిచేసింది.

Simone Biles
టోక్యో ఒలింపిక్స్

By

Published : Aug 1, 2021, 8:36 AM IST

Updated : Aug 1, 2021, 11:32 AM IST

టోక్యోలో వివిధ దేశాల ఆటగాళ్లు తమ సత్తాచాటుతున్నారు. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఒలింపిక్ గ్రామమంతటా పతకాల మోత మోగుతోంది. ఈ క్రమంలో శనివారం వివిధ ఆటల్లో అప్​డేట్స్​ ఇలా ఉన్నాయి.

బైల్స్ మరో రెండు..

అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌

అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ తన అభిమానుల్ని మరోసారి తీవ్ర నిరాశకు గురి చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగి, టీమ్‌ ఈవెంట్‌తో కలిపి ఆరు స్వర్ణాలపై కన్నేసిన ఆమె.. అన్నింట్లోనూ ఫైనల్స్‌కు అర్హత సాధించాక, అసలు పోటీల నుంచి వరుసగా వైదొలుగుతూ షాకిస్తోంది. మానసిక సమస్యలతో ఇప్పటికే టీమ్‌ ఈవెంట్‌, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌ నుంచి తప్పుకున్న ఆమె.. తాజాగా వాల్ట్‌, అన్‌ ఈవెన్‌ బార్స్‌ ఫైనల్స్‌కు దూరమైంది. టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్‌ మధ్యలో బైల్స్‌ వైదొలిగాక అయిదు రోజుల విరామం తర్వాత.. ఆదివారం వాల్ట్‌, అన్‌ ఈవెన్‌ బార్స్‌ ఫైనల్స్‌ జరగనుండటంతో ఆమె కోలుకుని ఉంటుందని, ఇందులో పోటీ పడుతుందని అభిమానులు ఆశించారు. కానీ తాను వాల్ట్‌లోనూ టైటిల్‌ నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగట్లేదని ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒక రోజు ముందే ప్రకటించింది. జిమ్నాస్టిక్స్‌ పోటీల మధ్యలో క్రీడాకారులు గాల్లో ఉన్నపుడు ఒకట్రెండు క్షణాల పాటు శూన్యం ఆవహించి ఏం చేయాలో తెలియని స్థితికి చేరుకునే 'ట్విస్టీస్‌' అనే సమస్యతో బైల్స్‌ బాధ పడుతోంది. మరి మిగతా రెండు వ్యక్తిగత ఈవెంట్ల ఫైనల్స్‌లో అయినా బైల్స్‌ పోటీ పడుతుందో లేదో చూడాలి.

లేటు వయసులో పసిడి..

యు జియాజున్‌

చైనా వెటరన్‌ వెయిట్‌లిఫ్టర్‌ యు జియాజున్‌ సత్తా చాటాడు. 37 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌లో పసిడి కొట్టి ఈ ఆటలో ఒలింపిక్స్‌ స్వర్ణం సాధించిన పెద్ద వయస్కుడిగా ఘనతను సొంతం చేసుకున్నాడు. పురుషుల 81 కిలోల విభాగంలో స్నాచ్‌లో 170 కిలోలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 204 కిలోలు ఎత్తిన యు జియాజున్‌ మొత్తం మీద 374 కిలోలతో అగ్రస్థానంలో నిలిచాడు. 2016లో రజతం నెగ్గిన అతడి ఖాతాలో 2012 లండన్‌ స్వర్ణం కూడా ఉంది. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని జియాజున్‌ అంటున్నాడు.

పోలెండ్ ఖాతాలో మిక్స్​డ్​ టైటిల్..

పోలెండ్ జట్టు

రిలే పరుగు అనగానే మొదట జమైకా గుర్తొస్తుంది.. లేదంటే అమెరికా పేరు ప్రస్తావనకు వస్తుంది. ఒలింపిక్స్‌ అయినా ప్రపంచ ఛాంపియన్‌సిప్‌ అయినా ఈ రెండు దేశాల అథ్లెట్ల గురించే ఎక్కువ చర్చ నడుస్తుంది. కానీ ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే పరుగులో పసిడి మాత్రం ఈ రెండు దేశాలకు దక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా పోలెండ్‌ పసిడి పతకాన్ని తన్నుకుపోయింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి.. ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన అమెరికా కనీసం రజతం కూడా దక్కించుకోలేకపోయింది. మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. కరోల్‌ జలేస్కి, నటాలియా కజ్మారెక్‌, జస్టినా స్వీటీ-ఎర్సెటిచ్‌, కజెతన్‌ దుసున్‌స్కీతో కూడిన పోలెండ్‌ జట్టు.. 3 నిమిషాల 9.87 సెకన్లలో రేసును పూర్తి చేసి అమెరికాకు షాకిచ్చింది. జట్టు సభ్యులందరికీ ఇదే తొలి ఒలింపిక్‌ పతకం. అమెరికా స్టార్‌ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ ఈ రేసు బరిలో దిగలేదు. జమైకాకు పతకమే దక్కలేదు. ఆ జట్టు ఫైనల్లో ఏడో స్థానంలో నిలిచింది. డొమినికన్‌ రిపబ్లిక్‌ రజతం గెలిచింది. ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల రేసు నిర్వహించడం ఇదే తొలిసారి.

తొలి పసిడి బ్రిటన్‌దే

ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన ట్రయథ్లాన్‌ మిక్స్‌డ్‌ రిలే స్వర్ణాన్ని బ్రిటన్‌ సొంతం చేసుకుంది. గంటా 23 నిమిషాల 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆ దేశం అగ్రస్థానంలో నిలిచింది. జెస్సికా, జోనాథన్‌, జార్జియా, అలెక్స్‌లతో కూడిన బృందం.. 300మీ. స్విమ్మింగ్‌, 6.8 కిలోమీటర్ల సైక్లింగ్‌, 2 కిలోమీటర్ల పరుగును మిగతా దేశాల అథ్లెట్ల కంటే ముందుగానే పూర్తిచేసింది. అమెరికా (1:23:55సె), ఫ్రాన్స్‌ (1:24.04సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.

బంగారు బుల్లోడు..

డ్రెసెల్‌

ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన డ్రెసెల్‌ పతక మోత మోగిస్తున్నాడు. శనివారం పురుషుల 100మీ. బటర్‌ఫ్లై ఫైనల్స్‌లో 49.45 సెకన్లలో రేసు పూర్తి చేసిన అతను ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అతనే నెలకొల్పిన రికార్డు (49.50సె)ను ఇప్పుడు మెరుగుపర్చుకున్నాడు. మిలాక్‌ (హంగేరియా- 49.68సె), పోంటి (స్విట్జర్లాండ్‌- 50.74సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు.

కళ్ల జోడు జారి..:

టోక్యోలో ఇంతకుముందే 100మీ. ఫ్రీస్టైల్‌, 4×100మీ. రిలే స్వర్ణాలను గెలుచుకున్న డ్రెసెల్‌కు ఓ విభాగంలో నిరాశ తప్పలేదు. ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన 4×100మీ. మెడ్లె రిలేలో అతను పోటీ పడగా.. ఇందులో అమెరికా కాంస్యం కూడా గెలవలేదు. బ్రిటన్‌ ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించింది. ఫైనల్లో 3 నిమిషాల 37.58 సెకన్లలో ఆ దేశ స్విమ్మర్లు లక్ష్యాన్ని చేరుకున్నారు. చైనా (3:38.86సె), ఆస్ట్రేలియా (3:38.95సె) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా (3:40.58సె) అయిదో స్థానంలో నిలించింది. ఈ రిలేలో ఇద్దరు చొప్పున పురుష, మహిళా స్విమ్మర్లు కలిసి పోటీపడతారు. ఒక్కో స్మిమ్మర్‌ ఒక్కో విభాగంలో 100మీ. పూర్తి చేయాలి. అమెరికా.. డ్రెసెల్‌ను ఫ్రీస్టైల్‌లో దించింది. అందులో మిగతా దేశాల నుంచి అమ్మాయిలే పోటీపడ్డారు. రెండో 100మీ. దూరాన్ని పూర్తి చేసేందుకు బ్యాక్‌స్ట్రోక్‌లో పోటీపడ్డ జకోబి డైవింగ్‌ చేసినపుడు కళ్లద్దాలు జారి నోటి దగ్గరకు వచ్చాయి. అలాగే ఈత కొనసాగించిన ఆమె ఒక్క నిమిషం 5.09 సెకన్లలో తన రేసు పూర్తి చేసింది. ఈ టైమింగే అమెరికాను దెబ్బకొట్టింది. చివరి 100మీ. రేసులో డ్రెసెల్‌ 46.99 సెకన్లలోనే రేసు పూర్తి చేసినా అమెరికాకు పతకం దక్కలేదు.

లెడెకీ సిక్సర్‌

లెడెకీ సిక్సర్‌

అమెరికా అమ్మాయి లెడెకీ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల 800మీ. ఫ్రీస్టైల్‌లో 8 నిమిషాల 12.57 సెకన్లలో రేసు పూర్తి చేసి విజేతగా నిలిచిన ఆమె.. ఒలింపిక్స్‌ చరిత్రలో ఆరు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన తొలి మహిళా స్విమ్మర్‌గా రికార్డు సాధించింది. లెడెకీకి పోటీ ఇస్తుందనుకున్న టిట్మస్‌ (ఆస్ట్రేలియా- 8:13.83సె) రజతం గెలిచింది. సిమోనా (ఇటలీ- 8:18.35) కాంస్యం దక్కించుకుంది. వ్యక్తిగత విభాగంలో.. మహిళల 1500మీ. ఫ్రీస్టైల్‌తో కలిపి ఈ క్రీడల్లో రెండు వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గిన లెడెకీ.. 2012 క్రీడల్లో ఓ పసిడి, 2016లో మూడు స్వర్ణాలు సొంతం చేసుకుంది. 800మీ. ఫ్రీస్టైల్‌లో ఆమె ఒలింపిక్స్‌ ఛాంపియన్‌గా నిలవడం ఇది వరుసగా మూడోసారి.

కేలీ.. మరోసారి

కేలీ

ఆస్ట్రేలియా స్విమ్మర్‌ కేలీ మెక్‌కియ్వాన్‌ మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మహిళల 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో 2:04.68సె టైమింగ్‌తో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. మాసె (కెనడా- 2:05.42సె), ఎమిలీ (ఆస్ట్రేలియా- 2:06.17సె) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కెలీకి టోక్యోలో ఇది రెండో స్వర్ణం. ఈ ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఇప్పటికే రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం అయిదు పతకాలు గెలిచింది. ఆదివారం పోటీ పడే రెండు విభాగాల్లో గెలిస్తే ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు గెలిచిన తొలి మహిళా స్విమ్మరవుతుంది.

జూడోలో జపాన్​ హవా..

ఎన్నో సవాళ్ల మధ్య ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్న జపాన్‌.. పోటీల్లోనూ గొప్పగా రాణిస్తోంది. టోక్యో క్రీడలు జపాన్‌కు ఇప్పటికే అత్యుత్తమ ఒలింపిక్స్‌గా నిలిచిపోయాయి. ముఖ్యంగా జూడో ఆ దేశానికి పతకాల పంట పండిస్తోంది. ఈ ఆటలో అందుబాటులో ఉన్న 15 స్వర్ణాల్లో జపానే 9 సాధించింది. మొత్తంగా జూడోలో 12 పతకాలు గెలుచుకుంది. 2020 క్రీడల్లో ఇప్పటివరకు 17 స్వర్ణాలు గెలిచిన జపాన్‌.. ఒలింపిక్స్‌ చరిత్రలోనే తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. 1964 (టోక్యో), 2004 (ఏథెన్స్‌) ఒలింపిక్స్‌ల్లో జపాన్‌ గరిష్టంగా 16 స్వర్ణాలు గెలుచుకుంది.

ఇవీ చదవండి:Tokyo Olympics: కీలక పోరుకు మెన్స్​ హాకీ జట్టు సన్నద్ధం

Tokyo Olympics: రికార్డు స్థాయి కేసులు.. నిరాటంకంగా క్రీడలు!

Last Updated : Aug 1, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details