అమెరికా అగ్రశ్రేణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మరోసారి తన అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. మానసిక సమస్యలతో వరుసగా ఒక్కో ఈవెంట్ నుంచి తప్పుకుంటున్న ఆమె.. తాజాగా ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్లోనూ పాల్గొనడం లేదని ప్రకటించింది. గతవారం ఈ ఈవెంట్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఆమె రెండో స్థానంలో నిలిచింది.
రియోగేమ్స్లో నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించిన రికార్డును.. బైల్స్ టోక్యో ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా మానసిక సమస్య 'ట్విస్టీస్' వల్ల వరుసగా ఈవెంట్స్ నుంచి తప్పుకుంటోంది. ఇటీవలే టీమ్ ఈవెంట్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఈవెంట్ ఫైనల్స్, వాల్ట్, అన్ ఈవెన్ బార్స్ ఫైనల్స్‌కు దూరమైంది. మంగళవారం(ఆగస్టు 3) జరగనున్న బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లో పాల్గొనాలా వద్దా ఆనే విషయమై బైల్స్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా జిమ్నాస్టిక్స్ వెల్లడించింది.
ఏమిటీ ట్విస్టీస్?
జిమ్నాస్ట్‌లు తాము పోటీ పడే రింగ్‌ల్లో, వాల్ట్ మీద గాల్లోకి ఎగిరి ఎలాంటి విన్యాసాలు చేస్తారు. మెరుపు ఒంటిని విల్లులా తిప్పుతూ.. రింగులు తిరుగుతూ.. పల్టీలు కొడుతూ.. అంతా అయ్యాక నిటారుగా నిలబడి బ్యాలెన్స్ చేసుకునే వైనం కళ్లు చెదిరేలా చేస్తాయి. అయితే గాల్లో అలా విన్యాసాలు చేస్తున్నపుడు ఉన్నట్లుండి క్షణ కాలం అంతా శూన్యంగా అనిపిస్తే.. మెదడుకు, శరీరానికి సంబంధం తెగిపోతే.. ఏం చేయాలో తెలియని స్థితిని ఎదుర్కొంటే.. దీన్నే 'ట్విస్టీస్' అంటారు. జిమ్నాస్ట్‌లు విన్యాసాలు చేస్తున్నపుడు ఏమాత్రం అదుపు తప్పినా.. పోటీలో గెలవడం సంగతలా ఉంచితే, ప్రమాదకర గాయాలవుతాయి. ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్లలో ఇలా అదుపు తప్పి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. శరీరం, మెదడుపై పూర్తి నియంత్రణ లేకుంటే ఏమైనా జరగొచ్చు. అందుకే ఇప్పుడీ ట్విస్టీస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న బైల్స్.. పోటీకి విముఖత చూపింది. మరి మిగిలిన ఆ ఒక్క ఈవెంట్ బ్యాలెన్స్ బీమ్ ఫైనల్లోనైనా బైల్స్ పోటీ పడుతుందో లేదో చూడాలి.
ఇదీ చూడండి:Olympics: నిరాశపరిచిన బైల్స్.. చరిత్ర సృష్టించిన పోలెండ్