తెలంగాణ

telangana

ETV Bharat / sports

Neeraj Chopra: ఆ మార్పుతోనే నీరజ్​కు స్వర్ణం - india at tokyo 2020

నీరజ్​ చోప్డా.. ప్రస్తుతం దేశమంతా మారుమోగిపోతున్న పేరు. దేశాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తూ 23 ఏళ్ల నీరజ్​.. టోక్యో ఒలింపిక్స్​ జావెలిన్​ త్రో విభాగంలో పసిడి సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. దీని వెనక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. ఎన్నో త్యాగాలు ఉన్నాయి. అయితే టోక్యోలో తన శైలిని మార్చుకోవడం వల్లే పసిడిని పట్టగలిగాడు నీరజ్​.

Niraj chopra
నీరజ్​ చోప్రా

By

Published : Aug 8, 2021, 7:25 AM IST

శనివారం.. సాయంకాలం! ఎప్పుడూలేని ఉద్వేగంతో వాతావరణం నిండిపోయింది! ఒంట్లోకి కొత్త చైతన్యం ప్రవేశించిన వేళ.. దేశం కళ్లార్పకుండా టీవీలకు అతుక్కుపోయింది. ఉత్కంఠగా ఊపిరి బిగబట్టి అటే చూస్తున్నారు.. చిన్నా.. పెద్దా! ఆసక్తిగా, ఆరాధనగా! అది క్రికెట్‌ ప్రపంచకప్‌ కాదు.. వాళ్లు చూస్తోంది క్రికెట్‌ స్టార్‌నూ కాదు..! వారి చూపులను, వారి హృదయాలను లాక్కుంటున్న ఆ అయస్కాంత శక్తి ఓ జులపాల కుర్రాడు. అతడి చేతిలో ఉందో జావెలిన్‌! అందరికీ ఆ ఆట గురించేమీ తెలియదు. బహుశా మొదటిసారి చూస్తున్నవారు కోట్ల మంది ఉండొచ్చు. కానీ వాళ్లందరి ఎమోషన్‌ ఒక్కటే. అందరి ఆశా ఒక్కటే. ఆ కుర్రాడు గెలవాలని.. ఈ దేశం మురవాలని!

అక్కడ టోక్యో ఒలింపిక్‌ స్టేడియంలో.. బాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా ఉన్న ఆ కుర్రాడూ అంతే..! సాటి భారతీయుల మనసులను చదివేసినట్లు, దేశం భారమంతా తనదే అయినట్లు ఈ రోజు మళ్లీ రాదన్నట్లు ఫీల్డ్‌లో అడుగుపెట్టాడు. హేమాహేమీలున్న పోటీ అది. కానీ ఆ కుర్రాడు అదేమీ పట్టించుకోలేదు. సింహంలా కదలి కసిగా జావెలిన్‌ను గాల్లోకి విసిరేశాడు. అంతే దేశం సంభ్రమాశ్చర్యాలతో ఉప్పొంగిపోయింది.

87.03 మీటర్లు.. ఇది తొలి ప్రయత్నంలో అతడు విసిరిన దూరం! ఎవరూ అతడి సమీపంలో కూడా లేరు! .. అంతే భారత్‌ పసిడి ఆశలకు రెక్కలొచ్చాయి. రెట్టించిన ఉత్సాహంతో అతడు రెండో ప్రయత్నంలో ఏకంగా 87.58 మీటర్లు విసిరేశాడు! అభిమానుల కళ్లలో స్వర్ణ కాంతులు..! కానీ ఏదైనా జరగొచ్చన్న ఆలోచన ఎవరినీ స్థిమితంగా నిలునివ్వలేదు. కానీ ప్రార్థనలు ఫలించాయి. అన్ని ప్రయత్నాలూ ముగిసి ఎవరూ తన దగ్గరకైనా రాలేకపోయిన వేళ ఆ జులపాల కుర్రాడు విజేతగా నిలిచాడు. చరిత్ర సృష్టించిన క్షణాన సింహ గర్జన చేశాడు. దేశం సంబరాల్లో మునిగిపోయింది.

ఎందుకంటే.. మామూలు విజయం కాదది. వంద కోట్ల జనాభా దాటిన దేశం.. వందేళ్ల నిరీక్షణకు తెరదించిన చిరస్మరణీయ విజయమది. కోట్ల స్వప్నాలు సాకారమై.. భారత అథ్లెటిక్స్‌కు తొలి ఒలింపిక్‌ పతకం (స్వర్ణం) అందిన సందర్భమది! ఆ మధుర క్షణాలను, ఆ అంతులేని ఆనందాన్ని అందించిన 23 ఏళ్ల ఆ కుర్రాడు నీరజ్‌ చోప్డా!

పసిడి గెలిచిన క్షణాలు..

నీరజ్​ కథ..

పదేళ్ల కిందట తన కొత్త కుర్తా, పైజామా వేసుకున్న ఓ 13 ఏళ్ల పిల్లాడు.. తన స్నేహితులకు వాటిని చూపిద్దామని ఆశగా బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. అప్పటికే వయసుకు మించి అధిక బరువు ఉన్న ఆ పిల్లాడిని ఆ దుస్తుల్లో చూసిన స్నేహితులు.. "చూడండి.. సర్పంచ్‌ వచ్చాడు" అని ఎగతాళి చేయడమే అందుక్కారణం. అప్పుడు వచ్చిన ఆ కన్నీళ్లే.. దేశానికి ఒలింపిక్‌ ఛాంపియన్‌ను అందించేందుకు పునాది వేశాయి. బరువు తగ్గడం కోసం ఈటెను పట్టుకున్న ఆ చేతులే.. ఇప్పుడు పసిడిని మెడలో ధరించాయి. చిన్నపుడు అధిక బరువుతో బాధపడ్డ ఆ పిల్లాడే.. ఇప్పుడు ఒలింపిక్‌ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్డా.

హరియాణాలోని పానిపట్‌కు సమీపంలో ఉన్న ఖాంద్రా గ్రామం నుంచి వచ్చిన నీరజ్‌.. చిన్నతనంలో అధిక బరువుతో బాధపడేవాడు. 17 మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబంలో పుట్టిన మొదటి బిడ్డ కావడంతో అతణ్ని గారాబంగా పెంచారు. పుష్టిగా తినడం.. ఊర్లో అల్లరి చిల్లరగా తిరగడం ఇదే బాల్యంలో అతని పని. దీంతో అతని బరువు పెరిగిపోయింది. తన స్నేహితులు అతణ్ని ఎగతాళి చేయడం మొదలైంది. అతను బాధతో కన్నీళ్లు పెట్టుకునేవాడు. అతని ఏడుపు చూసిన తల్లిదండ్రులు ఎలాగైనా బరువు తగ్గించాలనే ప్రయత్నాలు మొదలెట్టారు. గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని పానిపట్‌ స్టేడియానికి తీసుకెళ్లి పరుగెత్తించారు. అప్పుడే జావెలిన్‌ త్రో ప్రాక్టీస్‌ చేస్తున్న అథ్లెట్లపై నీరజ్‌ కన్ను పడింది. ఆ ఆట అతణ్ని ఆకర్షించింది. అలా తొలిసారి ఈటె పట్టుకుని ఓ సారి ప్రయత్నించాక.. ఇక అదే తన లోకమైంది. బరువు తగ్గించుకోవడం కోసం జిమ్‌లో కష్టపడుతూ.. మైదానంలో ఈటెతో స్నేహం చేశాడు. తర్వాత మెరుగైన శిక్షణ కోసం పంచకులలోని దేవీలాల్‌ స్టేడియానికి వెళ్లాడు. 2012 చివరికి అండర్‌-16 జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న అతను పతకం గెలవలేకపోయాడు. దీంతో ఆటలో తర్వాతి స్థాయికి చేరాలంటే ఉత్తమమైన శిక్షణ, వసతి, సామగ్రి అతనికి అవసరమైంది. 2015లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి.. జూనియర్‌ జాతీయ రికార్డు బద్దలు కొట్టడం వల్ల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ రికార్డుల వేట కొనసాగించాడు. 2015 చివర్లో 80 మీటర్ల మార్కును దాటిన అతను.. 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి నెగ్గాడు. ప్రపంచ అండర్‌-20 ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా జూనియర్‌ ప్రపంచ రికార్డు సృష్టించి సంచలనం సృష్టించాడు.

అంతకుమించి..

జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత నీరజ్‌ ప్రదర్శన మరో స్థాయికి చేరింది. అత్యుత్తమ శిక్షణ కోసం జర్మనీకి వెళ్లిన అతను.. తన ఆటను గొప్పగా మెరుగుపరుచుకున్నాడు. 2018 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో పసిడితో సత్తాచాటాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో అతను పతకం సాధిస్తాడనే ఆశలు చిగురించాయి. మధ్యలో కరోనా పరిస్థితులు, భుజం గాయం అనే అడ్డంకులను దాటాడు. ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని ముద్దాడాడు. చిన్నతనంలో ఆట పట్టించడానికి 'సర్పంచ్‌' అని నీరజ్‌ను ఎగతాళి చేసిన అతని గ్రామస్థులు.. ఇప్పుడూ అదే పిలుపును కొనసాగిస్తున్నారు. కానీ ఈ 'సర్పంచ్‌' ప్రేమతో, గౌరవంతో కూడుకున్నది.

టెక్నిక్​లో మార్పులు..

మిగతా వేదికలతో పోల్చితే టోక్యోలో జావెలిన్‌ను మరీ పైకి కాకుండా కాస్త ఎత్తు తగ్గించి సమాంతరంగా విసిరాడు చోప్డా. టోక్యోలో గాలి ఎక్కువగా ఉండటం వల్ల ఎత్తుగా విసిరితే జావెలిన్‌ ముందే నేలకు దిగడాన్ని గమనించి ఈ మార్పు చేశాడు. ఫైనల్లో సైతం అతను ఇదే టెక్నిక్‌ను అనుసరించాడు. జులపాలను ఇష్టపడే నీరజ్‌ టోక్యోకి వచ్చే ముందు జుట్టును బాగా దగ్గరిగా కత్తిరించేసుకున్నాడు.

సుబేదార్​ చోప్డా..

నీరజ్‌ చోప్డా అథ్లెట్‌ మాత్రమే కాదు భారత సైన్యం స్ఫూర్తి కూడా అతడిలో ఉంది. అతడు సైన్యంలో నాలుగో రాజ్పుతానా రైఫిల్స్‌ బృందంలో నాయిబ్‌ సుబేదార్‌గా పని చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నీరజ్‌ ప్రతిభను గుర్తించిన భారత ఆర్మీ 2016లో అతడిని జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా నియమించింది. సాధారణంగా క్రీడాకారులను నాన్‌ కమిషన్డ్‌ ర్యాంకు ఉద్యోగాలకు తీసుకుంటారు. కానీ నీరజ్‌పై ఎంతో నమ్మకముంచిన సైన్యం అతడికి ఆరంభంలోనే మంచి ఉద్యోగం ఇచ్చింది. సైన్యంలో చేరిన తర్వాత ట్రైనింగ్‌ సజావుగా సాగడానికి ఆర్మీ సాయం చేసింది.

వ్యవసాయ కుటుంబం

నీరజ్‌ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. అతడు 17 మంది కుటుంబ సభ్యులు ఉండే ఉమ్మడి కుటుంబంలో పుట్టాడు. హరియాణాలోని పానిపట్‌కు సమీపంలోని కాంద్రా గ్రామంలో అతడి తండ్రి సతీష్‌ కుమార్‌ చోప్రా పంట సాగు చేసేవాడు. నీరజ్‌ తల్లి సరోజ్‌ బాలాదేవి గృహిణి. అతడికి సంగీత, సరిత అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

సంబరాలు

కాసుల వర్షం

నీరజ్‌ చోప్డాపై కనక వర్షం కురుస్తోంది. అతడి సొంత రాష్ట్రం హరియాణా రూ.6 కోట్లు నగదు బహుమతి ప్రకటించగా.. పంజాబ్‌ రూ.2 కోట్లు నజరానా ఇచ్చింది. అలాగే నీరజ్‌కు రూ.కోటి నజరానా ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీ నీరజ్‌కు రూ.కోటి బహుమతిగా ప్రకటించింది. హరియాణాకు చెందిన ఎలాన్‌ గ్రూప్‌ కూడా అతడికి రూ.25 లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి:-నీరజ్​కు మోదీ ఫోన్​.. ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details