తెలంగాణ

telangana

ETV Bharat / sports

వందేళ్ల భారత నిరీక్షణకు తెర - టోక్యో ఒలింపిక్స్

ఒలింపిక్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం.. పతకం నెగ్గిన ముగ్గురు అథ్లెట్ల జాతీయ జెండాలు పైకెగురుతున్నాయ్‌.. అందులో మన మువ్వన్నెల జెండా కూడా ఉంది.. భారత జాతీయ గీతం వినిపిస్తోంది.. పోడియంపై భారత క్రీడాకారుడూ ఉన్నాడు. అతడి మెడలో పతకం పడుతోంది.. ఇది 1900లో భారత తొలి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ విశ్వ క్రీడల్లో అడుగు పెట్టినప్పట్నుంచి కంటున్న కల! అది టోక్యో వేదికగా శనివారం నిజమైంది.

neeraj chopra
నీరజ్ చోప్డా

By

Published : Aug 8, 2021, 6:07 AM IST

Updated : Aug 8, 2021, 6:49 AM IST

1900లో భారత జనాభా 24 కోట్లు. ఇప్పుడది 130 కోట్లను దాటిపోయింది. ఈ 121 ఏళ్లలో ఇన్ని కోట్ల మందిలో లక్షల మంది అథ్లెటిక్స్‌ ఆడారు. వందల మంది ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. అందులో మిల్కా సింగ్‌, పీటీ ఉష.. లాంటి ఆశలు రేపిన దిగ్గజాలూ ఉన్నారు. కానీ అందరికీ పతకం ఓ సుదూర స్వప్నమే!
ఇన్నేళ్లకు ఒకడొచ్చాడు. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో ఓ భారతీయుడు పతకం సాధిస్తేనే దాన్నొక అద్భుతంలా చూసే స్థితిలో.. నీరజ్‌ చోప్డా ఏకంగా స్వర్ణానికే గురి పెట్టేశాడు..! తొలి ప్రయత్నంలోనే శక్తినంతా కూడదీసుకుని 'టాప్‌' లేచిపోయేలా విసిరాడు బల్లెం. పట్టికలో మనోడిదే అగ్రస్థానం! కాసేపటికి మళ్లీ వచ్చాడు. ఈసారి ఇంకా దూకుడుగా విసిరాడు. బల్లెం ఎక్కడ పడిందో కూడా చూడలేదు. తన ప్రదర్శన ఎంతో కూడా తెలుసుకోలేదు. విసురుతున్నపుడే అతడికర్థమైపోయింది.. తాను చరిత్ర సృష్టించేశానని! అంతే.. వెనక్కి తిరిగి.. "నేను సాధించేశా" అన్నట్లు చేశాడు ఒక సింహనాదం! ఆ క్షణం.. భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహాద్భుతం!

జావెలిన్ విసురుతున్న నీరజ్

2021 ఆగస్టు 7.. శనివారం సాయంత్రం.. సమయం 5.30 గంటలు.. టోక్యో ఒలింపిక్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో జావెలిన్‌ త్రో పతక ప్రదానోత్సవం జరుగుతోంది. జెండాలు పైకెగురుతున్నాయ్‌. మన త్రివర్ణ పతాకం అటో ఇటో కాదు.. మధ్యలో ఉంది. పోడియంపై మన నీరజ్‌ చోప్డా ఉన్నాడు.. అది కూడా అందరికంటే ఎత్తులో! కాంస్యమో, రజతమో కాదు.. అతణ్ని వరించింది ఏకంగా స్వర్ణమే!
వందేళ్లకు పైగా నిరీక్షించిన విజయమిది.

నీరజ్ చోప్డా

నీరజ్ ఘనతలు..

  • 87.58 మీటర్లు- జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ చోప్డా అత్యుత్తమ ప్రదర్శన ఇది. తన రెండో ప్రయత్నంలో విసిరిన ఈ త్రోతో అతడు స్వర్ణం చేజిక్కించుకున్నాడు.
  • ఒలింపిక్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు వచ్చిన తొలి స్వర్ణమిదే. 121 ఏళ్ల భారత ఒలింపిక్‌ చరిత్రలో అథ్లెటిక్స్‌లో దక్కిన మొదటి పతకమిది.
  • టోక్యోలో భారత అథ్లెట్లు గెలిచిన పతకాలు 7. లండన్‌ ఒలింపిక్స్‌లో సాధించిన ఆరు పతకాల రికార్డును అధిగమించింది.
  • ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ పది స్వర్ణాలు గెలిచింది. హాకీలో అత్యధికంగా 8 బంగారు పతకాలు వచ్చాయి. 2008లో షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా పసిడి గెలిచాడు. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణం రావడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:Olympics 2020: ఈ ఒలింపిక్స్​లో 'భారత' పతక విజేతలు వీరే..

Last Updated : Aug 8, 2021, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details