తెలంగాణ

telangana

Olympics: అమ్మాయిలూ.. నీది నాది ఒకే కథ!

By

Published : Aug 2, 2021, 9:37 PM IST

భారత మహిళల హాకీ జట్టు.. తొలిసారిగా విశ్వక్రీడల సెమీస్​లోకి ప్రవేశించి సరికొత్త రికార్డు సృష్టించింది. పతకానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ సందర్భంగా టీమ్ఇండియాలోని ఆటగాళ్లు ఎవరు? వారి నేపథ్యమేంటి?

hockey india
హాకీ ఇండియా

ఈ సారి ఒలింపిక్స్​లో భారత్​కు పతకావకాశాలు ఉన్న ఆటల్లో హాకీ ఒకటి. అందుకు అనుగుణంగానే పురుషుల, మహిళల జట్లు సెమీస్​కు దూసుకెళ్లాయి. అయితే గ్రూప్​ దశలో వరుస ఓటములతో కొంత అనుమానాలు రేకెత్తించిన రాణి రాంపాల్​ సేన.. తిరిగి పోటీలో నిలిచింది. ఎలాగోలా క్వార్టర్స్​కు చేరుకున్నమనుకున్నా మన జట్టుకు ఆస్ట్రేలియా రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. అయినప్పటికీ 1-0 తేడాతో చిత్తుగా ఓడించి కంగారూలకు ఝలక్ ఇచ్చింది. తొలిసారి సెమీస్​లోకి అడుగుపెట్టింది భారత జట్టు. అయితే ఈ విజయం వెనక ఆటగాళ్ల విశేష కృషి ఉంది. ఈ సందర్భంగా మహిళా ప్లేయర్ల గురించి ప్రత్యేక కథనం.

రాణి రాంపాల్..

హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలోని షాబాద్​ రాణి స్వస్థలం. చిన్ననాటి నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్న రాణి.. విరిగిన హాకీ స్టిక్​తో తన క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఆటపై ఉన్న మక్కువతో 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు సంపాదించింది. అనతికాలంలోనే టీమ్​లో తనదైన ముద్ర వేసింది.

భారత మహిళల విజయానందం

జట్టులో స్ఫూర్తిదాయక ఆటగాళ్లలో కెప్టెన్ రాణి రాంపాల్ ఒకరు. ఆమె సారథ్యంలో టీమ్​ చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసింది. 13 ఏళ్ల అనంతరం 2017లో మహిళల ఆసియా కప్​ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది మన జట్టు. ​2018 ఆసియా గేమ్స్​లో భారత్​కు వెండి పతకం అందించింది రాణి.

సవిత పూనియా..

హరియాణాలోని సిర్సా జిల్లాకు చెందిన సవిత భారత అత్యుత్తమ గోల్​కీపర్లలో ఒకరు. దక్షిణాఫ్రికా డర్బన్​లో జరిగిన స్పార్ కప్​ ఫోర్​ నేషన్స్​ టోర్నీ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపికైంది. అప్పుడు పూనియా వయసు 18 ఏళ్లు.

పూనియాకు జీవితంలో జూడో లేదా బ్యాడ్మింటన్​ ప్లేయర్​గా స్థిరపడాలని ఉండేది. కానీ, తన తాతయ్య కారణంగా హాకీని ఎంచుకుంది. ఆమెకు ఇష్టం లేనప్పటికీ 20 కిలోల గోల్​కీపింగ్​ కిట్​తో రెండు గంటల పాటు ప్రయాణించి ఆటలో మెలకువలు నేర్చుకుంది.

ఇదీ చదవండి:Olympics: డిస్కస్​ త్రోలో నిరాశపర్చిన కమల్​ప్రీత్ కౌర్

నేహా గోయల్..

హరియాణాలోని సోనేపట్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నేహా.. అతి తక్కువ కాలంలో భారత జట్టులో కీలక ప్లేయర్​గా మారింది. 2018 ఆసియా గేమ్స్​లో వెండి పతకం గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలు. జట్టులోకి రాకముందు నేహా తన తల్లి, సోదరిలతో కలిసి ఓ సైకిల్​ ఫ్యాక్టరీలో పనిచేసేది. నేహా తన తల్లి సాయంతో హాకీ అకాడమీలో చేరి.. ఆటపై పట్టు సాధించింది.

2011లో జరిగిన జూనియర్​ ఆసియా కప్​ సందర్భంగా తొలిసారిగా టీమ్ఇండియా తలుపుతట్టింది నేహా. అప్పుడామెకు 14 ఏళ్లు. అదే ఏడాది అండర్​ 21 ఫోర్​ నేషన్స్​ లాల్​ బహదూర్​ శాస్త్రి మహిళల హాకీ టోర్నీ ద్వారా జట్టులో సుస్థిర స్థానం సంపాదించింది. 2014లో గ్లాస్గోలో జరిగిన ఎఫ్​ఐహెచ్​ ఛాంపియన్స్ ఛాలెంజ్​లో సీనియర్​ టీమ్​లో చోటు దక్కించుకుంది.

ఓ వైపు ఆనందం.. మరో వైపు నిరాశ

సలీమా టేటే..

ఝార్ఖండ్​లోని నక్సల్స్​ ప్రభావిత ప్రాంతమైన సిందిగా జిల్లాలోని బడ్కిచాపర్​ గ్రామం సలీమా స్వస్థలం. 2018 యూత్​ ఒలింపిక్స్​లో రజతం గెలిచిన భారత జట్టుకు సలీమా సారథ్యం వహించింది.

టేటే ఆటను చూడటానికి ఆమె స్వగ్రామంలో ఇప్పటికీ ఒక్క టీవీ కూడా లేదు. అక్కడ కనీసం ఇంటర్నెట్​ సదుపాయం కూడా ఉండదు. సలీమా నాన్న రైతు. హాకీపై ఆయనకు ఉన్న ప్రేమతో తన కూతురును ఆ ఆట వైపు ప్రోత్సాహించారు. ప్రారంభంలో సలీమా ప్రాక్టీస్​ చేయడానికి సరైన హాకీ స్టిక్స్​ కూడా ఉండేవి కాదు. కేవలం కర్రలతోనే ఆమె సాధన కొనసాగించేది.

నిక్కీ ప్రధాన్..

27 ఏళ్ల నిక్కీది.. ఝార్ఖండ్​ కుంతిలోని హెసల్​ గ్రామం. ఈ ప్రాంతం మొత్తం గిరిజన ఆవాసం. నక్సల్స్​కు మంచి పట్టున్న ప్రాంతం.

రియో ఒలింపిక్స్​లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నిక్కీ.. విశ్వక్రీడల్లో ఆ రాష్ట్రం నుంచి పాల్గొన్న తొలి హాకీ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అప్పటినుంచి భారత్​ పాల్గొన్న ప్రతి ముఖ్యమైన టోర్నీలో నిక్కీ భాగమైంది.

నిక్కీ తండ్రి బిహార్​లో పోలీసుగా ఉద్యోగం చేస్తున్నారు. దీంతో సంరక్షణ బాధ్యతలన్నీ ఆమె తల్లి చూసుకునేది. నిక్కీ హాకీ ఆడే తొలినాళ్లలో చాలా భయపడేదట. హాకీ కర్ర ఎక్కడ తనకు తగిలి కాళ్లు విరుగుతాయేమోనని ఆందోళన చెందేదట.

ఇదీ చదవండి:రెజ్లర్​ సుశీల్​పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్​

లాల్రేమియామి..

జట్టులోని యువ క్రీడాకారిణిలలో లాల్రేమియామి ఒకరు. మిజోరంలోని కోలసిబ్​లో జన్మించిన ఈ 21 ఏళ్ల ప్లేయర్​.. ఆ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్​లో పాల్గొన్న తొలి క్రీడాకారిణి.

2018 యూత్​ ఒలింపిక్స్​లో భారత జట్టు వెండి పతకం గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అప్పటి నుంచి లాల్రేమియామిని సియామి అనే ముద్దుపేరుతో పిలుచుకుంటారు సహచర సభ్యులు.

హాకీ కెరీర్​గా ఎంచుకోవడానికి ఆమె ఇష్టపడినా.. ఆమెకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదు. కారణం, ఆ రాష్ట్రంలో హాకీకి అంతగా ప్రాధాన్యత లేకపోవడమే. తర్వాత ఎలాగోలా జట్టుతో చేరినా.. భాష సమస్య వచ్చింది. తన సైగలతో తన భావాలను సహచరులతో పంచుకునేది లాల్రేమియామి.

ఆటగాళ్ల ఆనందం

జపాన్​ హిరోషిమా వేదికగా ఎఫ్​ఐహెచ్​ సిరీస్​ ఫైనల్స్​లో భాగంగా చిలీతో జరిగిన సెమీస్​కు ముందు లాల్రేమియామి తండ్రి మృతి చెందారు. ఒలింపిక్స్​ అర్హత టోర్నీల్లో ఒకటైన ఈ మ్యాచ్​ కోసం ఇంటికి కూడా వెళ్లకుండా, తండ్రి మరణాన్ని దిగమింగి ఆడింది.

దీప్​ గ్రేస్​ ఎక్కా..

నిరాడంబరమైన గిరిజన రైతు కుటుంబంలో జన్మించింది గ్రేస్. ఐదుగురు సంతానంలో చిన్నది. 12 ఏళ్లు వచ్చేంతవరకు ఆమెకు హాకీ స్టిక్​ అంటే ఏమిటో తెలీదు.

హాకీని క్రీడగా ఎంచుకున్న తర్వాత ఆమె కుటుంబంపై చాలా మంది విమర్శలు చేశారు. అయిన ఇవేమీ పట్టించుకోకుండా ఆమె ఆటలో రాణించింది. ఒడిశా నుంచి వచ్చిన అత్యుత్తమ డిఫెండర్లలో గ్రేస్ ఒకరు. గోల్​కీపర్​గా ఆడాలని ఎక్కాకు ఇష్టంగా ఉండేది. 2013 మహిళల ఆసియా కప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న సీనియర్ జట్టులో గ్రేస్ సభ్యురాలు.

గోల్​కీపర్​ సవిత పూనియా

సుశీలా చాను..

జట్టులోని అనుభవజ్ఞులలో సుశీలా ఒకరు. రియో ఒలింపిక్స్​లో జట్టుకు నాయకత్వం వహించింది. మణిపూర్​ ఇంఫాల్​కు చెందిన చాను.. 11 ఏళ్లకే హాకీ స్టిక్​ను చేత పట్టింది. తన తండ్రి డ్రైవర్​. 18 ఏళ్లకే టికెట్ కలెక్టర్​గా ఉద్యోగం. కానీ, మనసంతా ఆటపైనే. దీంతో హాకీనే జీవితమనుకుంది.

2014, 2018 కామన్వెల్త్​ క్రీడల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించిన చాను.. జట్టుకు కొన్ని తిరుగులేని విజయాలు అందించింది. భువనేశ్వర్​ వేదికగా 2019లో జరిగిన ఎఫ్​ఐహెచ్​ సిరీస్​లో ఆమె కీలక పాత్ర పోషించింది.

తొలుత కనీసం రాష్ట్ర జట్టుకు కూడా ఎంపిక కాలేదు చాను.. దీంతో కొంతకాలం హాకీని పక్కనపెట్టింది.

ఇదీ చదవండి:P.V. Sindhu: కాంస్యం గెలవడం సంతోషంగా ఉంది

గుర్జీత్ కౌర్..

భారత జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లలో గుర్జీత్​ ఒకరు. డిఫెండర్​గా, ఫ్లిక్కర్​గా రెండు పాత్రలు పోషిస్తుంది. ఇండియా సాధించిన అద్భుత విజయాలలో గుర్జీత్ పాత్ర అసాధారణం. క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాపై విజయంలో చేసిన ఏకైక గోల్​ గుర్జీత్​ చేసినదే.

పంజాబ్​ అమృత్​సర్​లోని మియాదిలో జన్మించింది గుర్జీత్​. తొలుత ప్రైవేట్​ పాఠశాలలో చదివిన కౌర్​కు బోర్డింగ్​ స్కూల్​కు వెళ్లే వరకు కూడా హాకీ అంటే ఏమిటో తెలియదు. తర్వాత వేరే అమ్మాయిలు ఆడుతుంటే చూసి ఆటపై ఇష్టం పెంచుకుంది.

క్వార్టర్స్​లో గెలిచిన ఆనందంలో భారత మహిళలు

వందన కఠారియా..

ఉత్తరాఖండ్​లోని రోష్నబాద్​ గ్రామానికి చెందిన వందన.. ప్రస్తుత భారత జట్టులో కీ ప్లేయర్. ఒలింపిక్స్​కు మూడు నెలల ముందు ఆమె తండ్రి మరణించారు. అయినా ప్రాక్టీస్​ వల్ల ఆమె వెళ్లలేకపోయింది. తన తండ్రి కారణంగానే హాకీలోకి వచ్చింది వందన.

నవజ్యోత్​ కౌర్..

భారత జట్టు అటాకింగ్​ మిడ్ ఫీల్డర్​ నవజోత్​ కౌర్​.. హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందినది. 2012లో భారత జట్టులో స్థానం సంపాదించింది. జూనియర్​ ఆసియా కప్​తో పాటు ఇంటర్నేషనల్ అండర్​ 21 టోర్నీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. అప్పటినుంచి భారత జట్టు సాధించిన ముఖ్యమైన విజయాల్లో కౌర్​ భాగమైంది.

భారత జట్టులోని చాలామంది లాగే.. నవజోత్​కు క్రీడానేపథ్యమేమీ లేదు. ​ఆమె తండ్రి మెకానిక్​గా పనిచేసేవారు.

నవనీత్ కౌర్..

జట్టులోని స్థిరమైన ఫార్వర్డ్​ ప్లేయర్లలో నవనీత్ కౌర్​ ఒకరు. ఆమె స్వస్థలం హరియాణాలోని షాబాద్. ఒలింపిక్స్​కు ముందు గత మేలో కొవిడ్ బారిన పడి కొంత ఇబ్బంది పడింది.

ఇదీ చదవండి:సుప్రీం ఆదేశంతో పారాలింపిక్స్​ బృందంలోకి షూటర్​

షర్మిలా దేవి..

2019 ఒలింపిక్స్​ అర్హత టోర్నీలో షర్మిలా అరంగేట్రం చేసింది. టోక్యో క్రీడలకు ముందు భారత జట్టు తరఫున కేవలం 9 గేమ్​లు మాత్రమే ఆడింది షర్మిలా.

మోనికా..

హరియాణాకు చెందిన మోనికా.. చాలా టోర్నీలలో స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఒలింపిక్స్​ అర్హత టోర్నీ అయిన ఎఫ్​ఐహెచ్​ సిరీస్​లో అమెరికాపై రాణించింది. 6-5తో భారత్​ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.

నిషా..

హరియాణాలోని సోనేపట్​కు చెందిన నిషా.. తన అరంగేట్రం మ్యాచ్​ 2019లో ఆడింది. హిరోషిమా వేదికగా జరిగిన ఎఫ్​ఐహెచ్​ సిరీస్​ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె తండ్రి ఒక టైలర్​. హాకీ ఆడాలన్న తన కూతురి కోరికను నెరవేర్చాడు. ఆమె ప్రయాణాల కోసం కొంత మొత్తం పక్కకు పెట్టేవాడు.

ఉదిత..

హరియాణాలోని హిస్సార్​లో జన్మించింది ఉదిత. 2017 న్యూజిలాండ్​ పర్యటనలో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు భారత్​ తరఫున 32 మ్యాచ్​లు ఆడింది.

చిన్నతనంలోనే ఆటలు ఆడటం ప్రారంభించినప్పటికీ.. తొలుత హ్యాండ్​బాల్​లో ప్రావీణ్యం సంపాదించింది. తర్వాత మెల్లగా హాకీ వైపు అడుగులు వేసింది.

స్జోర్డే మారిజ్నే..

2017లో మహిళల హాకీ జట్టు కోచ్​గా నియమితుడైన డచ్​ ఆటగాడు స్జోర్డే మారిజ్నే. తర్వాత కొంత కాలానికే భారత పురుషుల జట్టుకు కోచ్​గా వెళ్లాడు. మళ్లీ 2018లో తిరిగి మహిళల జట్టు కోచ్​గా తిరిగి నియామకం అయ్యాడు.

ఆటగాడిగా నెదర్లాండ్స్​కు ప్రాతినిధ్యం వహించిన మారిజ్నే.. కోచ్​గా మహిళల అండర్​ 21 ప్రపంచకప్​ అందించాడు. డచ్​ సీనియర్​ మహిళల జట్టుకు స్వర్ణం సాధించిపెట్టాడు.

ఇదీ చదవండి:Olympics: ఫైనల్​ బెర్త్​పై హాకీ పురుషుల జట్టు గురి

ABOUT THE AUTHOR

...view details