జపాన్ టోక్యో వేదికగా ఒలింపిక్స్(Tokyo Olympics 2020) దిగ్విజయంగా ముగిశాయి. పతకాల పట్టికలో అమెరికానే మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. చివరివరకు చైనా టాప్‌లో ఉండగా ఆఖరిరోజు పలు విభాగాల్లో బంగారు పతకాలు గెల్చిన అమెరికా, చైనాను అధిగమించింది.
అయితే.. ఇప్పుడు చైనా మీడియాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కారణం.. ఒలింపిక్స్ పతకాల పట్టికలో చైనాను అగ్రస్థానంలో చూపిస్తుండటమే. నెం.1లో అగ్రరాజ్యం ఉంటే.. చైనా ఎలా వచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
వాస్తవానికి 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్య పతకాలతో అమెరికా మొత్తం 113 మెడల్స్‌తో టాప్‌లో నిలిచింది. చైనా 88 పతకాలతో (38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం) ద్వితీయ స్థానం సొంతం చేసుకుంది. చైనా మీడియాలో మాత్రం ఆ దేశం 42 స్వర్ణాలు, 37 రజతాలు, 27 కాంస్యాలతో 106 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నట్లు చూపిస్తోంది!