టోక్యో పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics) భారత జోరుకు విరామం. వరుస పతకాలతో హోరెత్తించిన మన పారా అథ్లెట్లు(Paralympics 2021 India).. బుధవారం ఉసూరుమనిపించారు. ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో స్వర్ణం సాధించి.. పారాలింపిక్స్‌లో(Paralympics 2021) పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన పారా షూటర్ అవని లెఖరా.. మిక్స్‌డ్ 10మీ. ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్1లో నిరాశపరిచింది. ఈ 19 ఏళ్ల షూటర్ ఫైనల్ చేరడంలో విఫలమైంది. పురుషుల విభాగంలో సిద్ధార్థ, దీపక్ వరుసగా 40, 43వ స్థానాల్లో నిలిచారు. పురుషుల ఎఫ్51 క్లబ్‌త్రోలో భారత పారా అథ్లెట్లు అమిత్, ధరంబీర్ పతకం గెలవలేకపోయారు. 27.77 మీటర్ల దూరం విసిరిన అమిత్ అయిదో స్థానంలో, 26.63 మీటర్ల ప్రదర్శనతో ధరంబీర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
బ్యాడ్మింటన్‌లో మిశ్రమం
పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో ప్రపంచ నం.1 ప్రమోద్ భగత్ శుభారంభం చేశాడు. గ్రూప్- ఎ మ్యాచ్‌లో అతను 21-10, 21-23, 21-9 తేడాతో మనోజ్ సర్కార్‌పై గెలిచాడు.మహిళల సింగిల్స్ ఎస్‌యూ5లో 19 ఏళ్ల పలక్ కోహ్లి 4-21, 7-21తో అయాకో (జపాన్) చేతిలో పరాజయంపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ గ్రూప్- బి మ్యాచ్‌లో ప్రమోద్- పలక్ జోడీ 9-21, 21-15, 19-21తో లుకాస్- ఫాస్టిన్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలైంది.