తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిగ్గజాలను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరు?

15 ఏళ్లకే వింబుల్డన్​లో వీనస్​ లాంటి టెన్నిస్ దిగ్గజాన్ని ఓడించింది యూఎస్ క్రీడాకారిణి కోరీ గాఫ్. ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ ప్రియుల్ని తన వైపు తిప్పుకుంది. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం!

వీనస్​ను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరో తెలుసా!

By

Published : Jul 9, 2019, 6:30 AM IST

Updated : Jul 9, 2019, 7:58 AM IST

15 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. పుస్తకాలతో కుస్తీ పడుతూ.. స్నేహితులతో సందడి చేస్తూ తల్లిదండ్రుల చాటు పిల్లల్లా ఉంటారు. కానీ అమెరికా టెన్నిస్ టీనేజ్​ సంచలనం కోరీ గాఫ్ వింబుల్డన్​లో దిగ్గజాలను ఓడించి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తోంది. వీనస్ విలియమ్స్​ లాంటి స్టార్​ను ఓడించి ప్రపంచ టెన్నిస్ ప్రియుల్ని తన వైపు తిప్పుకుంది. వింబుల్డన్​లో ప్రీ క్వార్టర్స్​ వరకు చేరిన ఈ యువ క్రీడాకారిణిపై ఓ లుక్కేద్దాం!

గెలిచిన ఆనందంలో కోరీ గాఫ్

తల్లిదండ్రులూ క్రీడాకారులే...

1968 వింబుల్డన్ ఓపెన్ శకం ఆరంభమైన తర్వాత మహిళల సింగిల్స్ విభాగంలో అత్యంత చిన్న వయసులో (15 ఏళ్ల 122 రోజుల) అర్హత సాధించింది కోరీ. తండ్రి అమెరికా బాస్కెట్ బాల్ ప్లేయర్, తల్లి కాండీ.. జిమ్నాస్టిక్ క్రీడాకారిణి. వీరిద్దరి ప్రొత్సాహంతో ఆటల్లో దృష్టి పెట్టింది గాఫ్​.

అథ్లెట్ కాస్తా రాకెట్ పట్టింది..

కోరీ గాఫ్ మొదట అథ్లెట్​ అవుదామనుకుంది. అనంతరం రాకెట్ పట్టుకుని 13 ఏళ్లకే యూఎస్ ఓపెన్ బాలికల సింగిల్స్ విభాగంలో రన్నరప్​గా నిలిచింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సరిసమానమైన టైటిల్​ను గెలిచింది. అప్పటికీ తనకు 14 ఏళ్లయిన లేవు.

ఫైనల్​కు ముందు పుస్తకాలతో కుస్తీ..

వింబుల్డన్ క్వాలిఫైయింగ్ పోటీలకు కోరీ గాఫ్ పెద్దగా సన్నద్ధం కాలేదు. ఫైనల్​కు ముందు సైన్స్​ పరీక్షకు రాత్రంతా పుస్తకాలతో కుస్తీ పట్టిందట. సాధన చేయకపోయినా బెల్జియంకు చెందిన 129వ క్రీడాకారిణీ గ్రీట్ మెనెన్​పై 6-1, 6-1 తేడాతో విజయం సాధించింది.

వైల్డ్​కార్డ్ ఎంట్రీతో వింబుల్డన్​కు అర్హత..

అర్హత పోటీల్లో విజయం సాధించిన టెన్నిస్ ర్యాంకింగ్స్​లో 301వ స్థానంలో ఉన్న గాఫ్ వింబుల్డన్​కు ఎంపిక కాలేదు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో వింబుల్డన్​లో చోటు దక్కించుకుంది. అప్పుడు షాపింగ్ చేస్తూ ఈ విషయాన్ని తెలుసుకుంది.

వింబుల్డన్ టీనేజ్ సంచలన కోరీ గాఫ్

వీనస్​పై విజయం..

సెరెనా, వీనస్ విలియమ్స్​కు పెద్ద​ అభిమాని కోరీ గాఫ్​. చిన్నప్పటి నుంచి వారి ఆటను చూస్తూ పెరిగిన ఆమె వింబుల్డన్​లో​ వీనస్​ను 6-4, 6-4 తేడాతో ఓడించింది. ఇందులో ఆసక్తికరమేంటంటే కోరీ గాఫ్ పుట్టకముందే వీనస్​ నాలుగు గ్రాండ్ స్లామ్​లు సాధించింది. ఈ విజయం తర్వాత గాఫ్ కాసేపు షాక్​లో ఉండిపోయింది. తాను గెలిచానని నమ్మలేకపోయింది.

వీనస్ విలియమ్స్​తో కోరీ గాఫ్

"ఈ మ్యాచ్​లో గెలవడం నా కల. ఈ మ్యాచ్​లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపుతో నా ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగింది" -కోరీ గాఫ్, టెన్నిస్ క్రీడాకారిణి

ఈ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భవిష్యత్తులో గాఫ్ మరిన్ని విజయాలు సొంతం చేసుకుటుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నారు అభిమానులు. అయితే వింబుల్డన్​లో కోరీ గాఫ్​ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్​లో హలెప్​(హంగేరి) చేతిలో ఓడింది.

ఇది చదవండి: వింబుల్డన్​లో దూసుకెళ్తోన్న కోరీ గాఫ్​

Last Updated : Jul 9, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details