తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ వయసులో ఇంకో ఏడాది ఆగాలంటే.. - టోక్యో ఒలింపిక్స్​

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తోంది.. క్రీడా రంగాన్ని అతలాకుతలం చేసేసింది. అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌నూ నిలిపివేయక తప్పలేదు. ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా వేయడంతో వయసు మీద పడుతోన్న క్రీడాకారుల పతకావకాశాలు దెబ్బతినే అవకాశముంది. బంగారు పతకం నెగ్గుదామనుకున్న వారి ఆశలు ఫలిస్తాయా..? లేటు వయసులో సత్తా చాటుతారా..?

Six stars for whom Olympics in 2021 may come too late
ఈ వయసులో ఇంకో ఏడాది ఆగాలంటే..

By

Published : Mar 27, 2020, 8:08 AM IST

ప్రపంచ దేశాలు కరోనాతో వణికిపోతున్నాయి. అన్ని రంగాలతో పాటు క్రీడారంగాన్ని కుదిపేసిందీ మహమ్మారి. ఫలితంగా ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్​ వాయిదాపడ్డాయి. అయితే... ఈ ఏడాది ఒలింపిక్స్‌ జరిగితే పసిడి పతకాలతో సత్తాచాటుదామనుకున్న దిగ్గజాలు.. మరో సంవత్సరం పాటు ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఈ మెగా క్రీడలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది వాళ్లకు పెద్ద సవాలే. మరి ఆ క్రీడాకారులెవరో చూద్దాం.

ట్రాక్‌ చిరుతలు..

ఆరు ఒలింపిక్‌ స్వర్ణాలు నెగ్గిన ఏకైక మహిళా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా చరిత్ర నమోదు చేసిన అమెరికా స్ప్రింటర్‌ ఎలిసన్‌ ఫెలిక్స్‌ టోక్యో క్రీడల్లోనూ బంగారు పతకాలు నెగ్గి తన కెరీర్‌కు అద్భుతంగా ముగించాలనుకుంటోంది. ఈ నవంబర్‌లో 36వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న ఆమె వరుసగా అయిదోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనబోతుంది.

ఫెలిక్స్​, గాట్లిన్​

టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెబుదామనుకున్న అమెరికా రన్నర్‌ జస్టిన్‌ గాట్లిన్‌ మరో ఏడాది ఆగాల్సి వస్తోంది. 38 ఏళ్ల గాట్లిన్‌ 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ 100మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలిచాడు. 40వ ఏట ఒలింపిక్స్‌లో పరుగెత్తడం గాట్లిన్‌కు కష్టమైన పనే.

రోజర్‌ ఫెదరర్‌

రోజర్​ ఫెదరర్​

20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌కు ఈ ఆగస్టుకు 39 ఏళ్లు నిండుతాయి. టోక్యో క్రీడల్లో పసిడి పతకంతో తన ఒలింపిక్‌ కెరీర్‌కు గుడ్‌బై చెబుదామనుకున్న అతడు దానికోసం తీవ్రంగా పోరాడక తప్పని పరిస్థితి నెలకొంది. మరో ఏడాది పాటు తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. మంచి ఫామ్‌ను కొనసాగించాలి. ఇప్పటివరకూ అతను సింగిల్స్‌లో ఒలింపిక్‌ స్వర్ణాన్ని గెలవలేకపోయాడు.

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్టాన్‌ వావ్రింకాతో కలిసి పురుషుల డబుల్స్‌లో బంగారు పతకం గెలిచిన అతడు.. 2012 లండన్‌ క్రీడల్లో సింగిల్స్‌లో రజతం నెగ్గాడు. గాయం కారణంతో 2016 రియో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో సెమీస్‌ వరకూ వెళ్లగలిగిన అతడికి ఆ క్రీడల్లో పతకమైతే దక్కలేదు కానీ తన భార్య మిర్కా అప్పుడే పరిచయమైంది.

సెరెనా విలియమ్స్‌

ఇప్పటికే నాలుగు ఒలింపిక్‌ స్వర్ణాలు ఖాతాలో వేసుకున్న మహిళల టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మరోసారి పోడియంపై నిల్చోవాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల ఆమె ఫామ్‌ గొప్పగా లేకపోయినప్పటికీ ఒలింపిక్స్‌లో మాత్రం తనదైన శైలిలో చెలరేగాలనే ఆశలు పెట్టుకుంది.

సెరెనా విలియమ్స్‌

వచ్చే సెప్టెంబర్‌లో 39వ పుట్టిన రోజు జరుపుకోనున్న ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలంటే కఠోరంగా శ్రమించాల్సిందే. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ పసిడి నెగ్గిన ఆమె.. అక్క వీనస్‌తో కలిసి ఆ క్రీడలతో పాటు 2000, 2008 ఒలింపిక్స్‌ల్లో డబుల్స్‌ స్వర్ణాలు గెలిచింది.

టైగర్‌ వుడ్స్‌

టైగర్​ వుడ్స్​

టోక్యో ఒలింపిక్స్‌ ఏడాది పాటు వాయిదా పడడం కొంతమందికి నిరాశను కలిగిస్తే.. గోల్ఫ్‌ దిగ్గజం టైగర్‌ వుడ్స్‌కు మాత్రం కొత్త ఆశను రేకెత్తించింది. ఈ ఏడాది ఒలింపిక్స్‌ జరిగితే అతడు ఆ మెగా క్రీడలకు అర్హత సాధించేవాడు కాదు. ప్రస్తుతం అమెరికాలో ఆరో ర్యాంకులో అతనున్నాడు. తొలి నాలుగు ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లనే ఒలింపిక్స్‌కు పంపుతారు. కానీ క్రీడలు వాయిదా పడడంతో తిరిగి తన సత్తాచాటి ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవాలనే ఆలోచనలో అతనున్నాడు.

వెన్నెముక గాయం తిరగబెట్టడంతో ఇబ్బంది పడుతున్న 44 ఏళ్ల వుడ్స్‌లో ఒలింపిక్స్‌ వాయిదాతో ఆశలు చిగురించాయి. గాయం కారణంగా 2016 రియో ఒలింపిక్స్‌కు దూరమైన అతను టోక్యో ఒలింపిక్స్‌లోనైనా బరిలో దిగాలని నిర్వాహకులు కూడా ఎదురుచూస్తుండడం విశేషం.

లియాండర్‌ పేస్‌

లియాండర్‌ పేస్‌

టోక్యో ఒలింపిక్స్‌తో తన పయనం ముగిస్తానని ఇంతకుముందే చెప్పేశాడు భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌. కానీ ఈ క్రీడలు వాయిదా పడడంతో అతని కెరీర్‌ సందిగ్ధంలో పడింది. రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్‌ ఆడటానికి ఉవ్విళ్లూరుతున్న 46 ఏళ్ల పేస్‌కు ఇప్పటిదాకా టోక్యో బెర్తు ఖాయం కాలేదు. అతడి రిటైర్మెంట్‌ ఏడాది వాయిదా పడ్డట్లేనని భావిస్తున్నారు.

టోక్యో క్రీడల వాయిదా సాహసోపేత నిర్ణయమని చెప్పిన పేస్‌.. తాను ఇంకా ఫిట్‌గానే ఉన్నానని ఎనిమిదో ఒలింపిక్స్‌ ఆడాలని ఉందని అంటున్నాడు. అర్హత సాధించినా.. లేటు వయసులో ఒలింపిక్స్‌లో రాణించడం అతడికి సవాలే.

లిన్‌ డాన్‌

లిన్​డాన్​

వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ జరిగే సమయానికి చైనా బ్యాడ్మింటన్‌ దిగ్గజం లిన్‌ డాన్‌కు 38వ ఏట ఉంటాడు. కెరీర్‌లో అయిదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న అతడు.. 2008, 2012 ఒలింపిక్స్‌ సింగిల్స్‌ స్వర్ణాలనూ దక్కించుకున్నాడు. ముచ్చటగా మూడోసారి బంగారు పతకాన్ని ముద్దాడాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే మొమొటో, చెన్‌, ఆంటోన్సెన్‌, విక్టర్‌ లాంటి యువ ఆటగాళ్లను దాటి అతడు ముందుకెళ్లడం చాలా కష్టంతో కూడుకున్న పని.

ABOUT THE AUTHOR

...view details