గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కోసం మైదానంలో పోరాడే టెన్నిస్ స్టార్ ప్లేయర్స్.. సేవా కార్యక్రమాల్లోనూ పోటీ పడుతున్నారు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మైదానంలో ప్రత్యర్థులుగా దిగారంటే గెలవడమే లక్ష్యంగా ఒకర్ని మించి ఒకరు ఆడుతుంటారు. అయితే తాజాగా వీరు.. కరోనా బాధితులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడంలోనూ పోటీపడుతున్నారు.
తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు స్వచ్ఛంద సంస్థలకు అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చిన టెన్నిస్ స్టార్ ప్లేయర్స్‌లో ఫెదరర్ కంటే జకోవిచ్ ముందున్నాడు.
జకోవిచ్
ప్రపంచ నెం.1 టెన్నిస్ ఆటగాడు జకోవిచ్.. ఇటీవల తాజాగా ఓ ఆస్పత్రికి రూ. 42.31 కోట్లు ( 5.6 మిలియన్లు డాలర్లు) విరాళంగా ఇచ్చాడు. అయితే ఇదేమి అతడి తొలి విరాళం కాదు. కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి విరాళాలను, ఇతరత్రా సహాయ కార్యక్రమాలను అందిస్తూనే ఉన్నాడు. తొలుత మార్చి 27న ఆ దేశ ప్రభుత్వానికి ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి 1.1మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించాడు. అనంతరం స్పానిష్ రైవల్ రాఫెల్ నాడల్స్ రిలీఫ్ ఫండ్, ఇటలీ దేశానికీ భూరి విరాళాం ఇచ్చాడు.
కరోనా వైరస్ ప్రభావం తాకకముందు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆస్ట్రేలియా కార్చిచ్చుపై పోరుకు ఈ ఏడాది జనవరిలో విడతల వారీగా 5లక్షల 25వేల డాలర్లను ఇచ్చాడు జకో. మొత్తంగా ఇప్పటివరకు ఈ ఏడాదిలో 7.5-8 మిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ప్రకటించి మంచి మనసును చాటుకున్నాడు.
రోజర్ ఫెదరర్
ఆస్ట్రేలియా కార్చిచ్చుపై పోరుకు జనవరిలో టెన్నిస్ ఆస్ట్రేలియా నిర్వహించిన 'ర్యాలీ ఫర్ రిలీఫ్' కార్యక్రమానికి 2లక్షల 50 వేల డాలర్లను విరాళంగా ఇచ్చాడు రోజల్ ఫెదరర్. అనంతరం కరోనాతో ప్రభావితమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు తన స్వచ్ఛంద సంస్థ ద్వారా విడతల వారిగా 3 మిలియన్ డాల్లర వరకు ఇచ్చాడు. 1మిలియన్ డాలర్‌తో దాదాపు 64వేల మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసి బాధితుల ఆకలి తీర్చాడు. మొత్తంగా జనవరి నుంచి ఇప్పటివరకు 5 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాన్ని అందించాడీ స్విస్ దిగ్గజం.
ప్రపంచాన్ని కమ్మేసిన మహమ్మారి కరోనాతో లక్షల మంది మరణించారు. అనేక మంది ఉపాధి కోల్పోయి, నిరాశ్రయులయ్యారు. ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఈ నేపథ్యంలో వైరస్ బాధితులను ఆదుకునేందుకు 'మేమున్నాం' అంటూ ప్రపంచవ్యాప్తంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలందరూ ముందుకొచ్చి తమ వంతుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల కోసం విరాళాలను సమీకరించడం, ఇవ్వడం సహా ఇతర సహాయాలూ చేస్తున్నారు.
ఇదీ చూడండి : వలసకూలీల ఆకలి తీర్చిన క్రికెటర్ షమి