స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ (Rafael Nadal) యూఎస్ ఓపెన్‌కు (US Open 2021) దూరమయ్యాడు. కాలిగాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ప్రకటించాడు. చివరిసారిగా వింబుల్డన్ ఓపెన్ సెమీస్‌లో ఆడాడు నాదల్. ఆ మ్యాచ్‌లో నొవాక్ జకోవిచ్‌తో తలపడి ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన వింబుల్డన్‌తో పాటు ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు.
"2021 సీజన్లో టెన్నిస్ ఆడలేకపోతున్నాను. ఇందుకు నన్ను క్షమించండి. నేను గత ఏడాది కాలంగా పాదం గాయంతో బాధపడుతున్నానని మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా ముఖ్యమైన టోర్నీలు కోల్పోయాను."
-రాఫెల్ నాదల్, స్టార్ టెన్నిస్ ప్లేయర్.
కాలి గాయం కారణంగా తీవ్రమైన నొప్పిని భరిస్తున్నానని నాదల్ తెలిపాడు. "సరిగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. అనుకున్న రీతిలో సన్నద్ధత కాలేకపోతున్నాను. ఇదేమీ కొత్త గాయం కాదు. 2005 నుంచి ఉన్నదే. కెరీర్ ఆరంభంలో నా భవిష్యత్ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కానీ, నేను అనుకున్నది సాధించగలిగాను. నేను కచ్చితంగా ఈ గాయం నుంచి బయటపడతాను" అని రాఫా వెల్లడించాడు.
తన టెన్నిస్ జీవితంలో మరికొన్ని అద్భుతమైన విజయాలు పొందుతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు నాదల్. అందుకే ప్రతిరోజు పోరాడుతున్నానని తెలిపాడు. నాదల్ ఇప్పటివరకు 20 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు. ఈ ఏడాది బార్సిలోనాతో పాటు రోమ్ టోర్నీలను తన ఖాతాలో వేసుకున్నాడు.
గాయం కారణంగా ఇప్పటికే రోజర్ ఫెదరర్ కూడా యూఎస్ ఓపెన్‌కు దూరమయ్యాడు. అతడి మోకాలికి మరో సర్జరీ చేయనున్నట్లు అతడు ప్రకటించాడు.
ఇదీ చదవండి:ఫెదరర్‌కు మరో సర్జరీ.. యూఎస్ ఓపెన్‌కు దూరం