తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎర్రమట్టి కోర్టులో ప్రీక్వార్టర్స్​ చేరిన దిగ్గజాలు - కాస్పర్‌ రూడ్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్విస్ మాస్టర్ రోజర్‌ ఫెదరర్‌, స్పెయిన్‌ బుల్ రఫెల్‌ నాదల్‌ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో మూడో సీడ్‌ ఫెదరర్‌ నార్వే యువ ఆటగాడు కాస్పర్‌ రూడ్‌ను ఓడించాడు. రెండో సీడ్‌ నాదల్‌ బెల్జియం క్రీడాకారుడు డేవిడ్‌ గోఫిన్‌పై గెలిచాడు.

ఎర్రమట్టి కోర్టులో ప్రిక్వార్టర్స్​ చేరిన దిగ్గజాలు

By

Published : Jun 1, 2019, 10:40 AM IST

ఫ్రెంచ్​ ఓపెన్​ మూడో రౌండ్​ గెలిచిన రోజర్​ ఫెదరర్​ 14వ సారి ప్రీక్వార్టర్స్​ చేరాడు. మరో స్టార్​ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 12వ సారి టైటిల్​ కోసం ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.

  • శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో మూడో సీడ్‌ ఫెదరర్‌ 6-3, 6-1, 7-6 (10-8)తో నార్వే టీనేజర్‌ కాస్పర్‌ రూడ్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో పెద్ద కష్టపడకుండానే గెలిచిన రోజర్‌కు మూడో సెట్లో రూడ్‌ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేకర్‌కు మళ్లిన ఈ సెట్లో.. 7-6 (10-8)తో గెలిచిన ఫెదరర్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోజర్‌ 11 ఏస్‌లతో పాటు 52 విన్నర్లు కొట్టాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు.
    ఫెదరర్​- కాస్పర్‌ రూడ్‌ పోరు

టైటిల్‌ ఫేవరెట్‌ రెండో సీడ్​ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 6-1, 6-3, 4-6, 6-3తో డేవిడ్‌ గోఫిన్‌ (బెల్జియం)ను ఓడించాడు. తొలి రెండు సెట్లు అలవోకగా గెలిచిన రఫా.. మూడో సెట్‌ను అనూహ్యంగా ఓడిపోయాడు. కానీ నాలుగో సెట్లో పుంజుకున్న ఈ స్పెయిన్‌ స్టార్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఏడో సీడ్‌ నిషికొరి (జపాన్‌) కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకున్నాడు. అతను 6-4, 6-7 (6-8), 6-3, 4-6, 8-6తో లాస్లో డెరె (సెర్బియా)పై చెమటోడ్చి గెలిచాడు. పౌలీ (ఇటలీ), బెన్నెట్‌ పైర్‌ (ఫ్రాన్స్‌) కూడా ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించారు.

అప్పుడు తండ్రిపై...ఇప్పుడు తనయుడిపై

తాజా విజయంతో ఫెదరర్‌ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్​ మూడో రౌండ్లో గెలిచిన రోజర్‌.. 400వ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 14వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌ చేరిన ఈ 37 ఏళ్ల స్విస్‌ స్టార్‌.. పీట్రాంగెలి (ట్యునీసియా, 1972, 38 ఏళ్లు) తర్వాత ఈ దశకు చేరిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. మూడో రౌండ్లో ఫెదరర్‌ గెలిచిన రూడ్‌కు ఓ కథ ఉంది. అతని తండ్రి కూడా రోజర్‌తో ఆడాడు. 1999 వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో రోజర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడినప్పుడు రూడ్‌ తండ్రి క్రిస్టియన్‌తో తలపడి విజయం సాధించాడు. అప్పుడు తండ్రిపై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరిన ఫెదరర్‌.. ఇప్పుడు తనయుడిపై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరడం విశేషం.

పేస్‌ జోడీ శుభారంభం

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, లియాండర్‌ పేస్‌ ముందంజ వేశారు. రెండో రౌండ్లో బోపన్న- మారిస్‌ కోపిల్‌ 6-4, 6-4తో బెంజిమన్‌-హొయాంగ్‌లపై గెలవగా.. తొలి రౌండ్లో పేస్‌-బెనోయిట్​ ద్వయం 6-4, 6-4తో ఇంగ్లాట్‌-కైజాన్‌ను ఓడించారు. దివిజ్‌ శరణ్‌-డిమోలియర్‌(భారత్​) జోడీ 3-6, 4-6తో కొంటినెన్‌-పీర్స్‌(ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details