కరోనా కారణంగా క్రీడా టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఇటీవలే లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కొన్ని దేశాల్లో టోర్నీలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ఎగ్జిబిషన్ టోర్నీలో టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. కానీ వీరి దురదృష్టవశాత్తు ఈ టోర్నీకి హాజరైన కొంతమందికి కరోనా సోకింది. ఇందులో జకోవిచ్ కూడా ఉన్నాడు. అయితే మిగతా ఆటగాళ్లందూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు అధికారులు. కానీ ఓ ఆటగాడు మాత్రం ఈ రూల్స్‌ని ఖాతరు చేయలేదు.
సెల్ఫ్ ఐసోలేషన్‌ను అతిక్రమించి క్లబ్‌లో చిందులు
ఆడ్రియా టూర్లో పాల్గొన్న టెన్నిస్ ఆటగాళ్లు జకోవిచ్‌తో సహా పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ టోర్నీకి హాజరైన మిగతా ఆటగాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు కోరారు. కానీ ఈ మాటల్ని పెడచెవిన పెట్టి క్లబ్‌కు వెళ్లి విమర్శల పాలయ్యాడు జర్మనీకి చెందిన జ్వెరెవ్.
జర్మనీకి చెందని అలెగ్జాండర్ జ్వెరెవ్ సెల్ఫ్ ఐసోలేషన్‌ను అతిక్రమించి పార్టీ చేసుకున్నాడు. ఒక క్లబ్‌లో ఎంచక్కా ఆడిపాడుతూ కనిపించాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫలితంగా విమర్శల పాలయ్యాడు. ఆడ్రియా టూర్లో పాల్గొనందుకు ప్రజలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానన్న జ్వెరెవ్.. ఏకంగా క్లబ్‌లోనే సందడి చేయడం పట్ల సహ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆడ్రియా టూర్లో పాల్గొన్న జకోవిచ్‌తో పాటు గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), క్రొయేషియా ఆటగాడు బోర్నా చోరిచ్, నొవాక్ ఫిట్‌నెస్ కోచ్ మార్కో పానిచిలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనిపై విచారం వ్యక్తం చేశాడు జకో.